వందేళ్ల రాజారెడ్డి.. 'వైఎస్' వంశ రాజకీయ ప్రస్థాన పునాది
అసలు ఆ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది.. తన ఇంటి పేరుతోనే ఓ పెద్ద రాజకీయ పార్టీ పుడుతుంది అనుకుని ఉంటారా? అది అధికారంలోకి వస్తుందని ఊహించి ఉంటారా?
By: Tupaki Desk | 29 May 2025 4:14 PM ISTఎదుగూరి సందింటి.. ఇలా విడిగా చెప్తే తొందరగా తెలియదమో..? ’వైఎస్’ అంటేనే అందరికీ తెలిసిపోతుందేమో..? అవును.. 50 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా సాగుతోంది ’వైఎస్’ కుటుంబ రాజకీయ ప్రస్థానం. అసలు ఆ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది.. తన ఇంటి పేరుతోనే ఓ పెద్ద రాజకీయ పార్టీ పుడుతుంది అనుకుని ఉంటారా? అది అధికారంలోకి వస్తుందని ఊహించి ఉంటారా?
వైఎస్ వంశ రాజకీయం యాభై ఏళ్లుగా సాగుతుండవచ్చు. స్థానిక సంస్థల నుంచి చట్ట సభల వరకు.. ఎమ్మెల్యే నుంచి సీఎం స్థాయికి చేరి ఉండవచ్చు. దీనికి పునాది వేసింది వైఎస్ రాజారెడ్డి. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి, విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్ కు తాత.
ప్రస్తుతం వైఎస్ రాజారెడ్డి శత జయంతి జరుపుకొంటున్నారు. రాజారెడ్డి 1925లో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం బలపనూరులో జన్మించారు. ఈయన తండ్రి వెంకటరెడ్డి. తల్లి మంగమ్మ. వెంకటరెడ్డి 1885లో పుట్టి.. 1957 వరకు జీవించారు.
వెంకటరెడ్డి ఆ కాలంలోనే వ్యాపారాలు, కాంట్రాక్టులు చేశారని చెబుతారు. రాజారెడ్డికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంటే 1933లో వీరి కుటుంబం పులివెందులకు వచ్చి స్థిరపడింది. అక్కడే వందకు పైగా ఎకరాలను కొని సాగు చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి అదే వారి అడ్డాగా మారింది.
1925లో జన్మించిన రాజారెడ్డి 1998 మే 23న హత్యకు గురయ్యారు. అప్పటికి ఆయన వయసు 73. ఆ సమయంలోనే తన రెండో కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక రాజారెడ్డికి ఐదుగురు కుమారులు. ఒక కుమార్తె.
వీరిలో పులివెందుల నుంచి ఒక్కసారీ ఓడిపోని వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. కడప నుంచి కూడా ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లారు. వైఎస్ వివేకా సైతం పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా గెలిచారు.
పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి 1978లో మొదలైన వైఎస్ కుటుంబ ప్రస్థానం.. అజేయంగా కొనసాగుతోంది. ఇక కడప ఎంపీ స్థానానికి 1989లో తొలిసారి వైఎస్ రాజశేఖ్ రెడ్డి పోటీ చేశారు. అప్పటినుంచి కడప ఎంపీ స్థానం కూడా వైఎస్ కుటంబం ఖాతాలోనే ఉంది.
ఇక 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ ఇంటిపేరు కలిసి వచ్చేలా దీనిని నెలకొల్పారు. 2019 ఎన్నికల్లో గెలుపొంది ఏపీకి సీఎం అయ్యారు. అలా.. వందేళ్ల కిందట పుట్టిన రాజారెడ్డి ఓ భారీ రాజకీయ ప్రస్థానానికి పునాది వేశారు. తమ ఇంటిపేరిటే పార్టీ ఏర్పాటయ్యేంత సామర్థ్యాన్ని తన బిడ్డలకు ఇచ్చారు.
గురువారం వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్బంగా ఆయన మనవడు వైఎస్ జగన్ విజయవాడలోని ఓ మానసిక దివ్యాంగ పిల్లల ఆశ్రమానికి వెళ్లారు. మనవరాలు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం తాతకు నివాళి అర్పించారు.
