మెటా.. ఎక్స్.. యూట్యూబ్.. గూగుల్ కు భారతిరెడ్డి లీగల్ నోటీసులు
తమ రాజకీయ ప్రత్యర్థులు ఐటీ సెల్ ప్రారంభించి తప్పుడు ప్రచారానికి తెర తీయటం ద్వారా తాము బాధితులుగా మారినట్లుగా ఆమె పేర్కొన్నారు.
By: Garuda Media | 18 April 2026 9:30 AM ISTసోషల్ మీడియాను అసరాగా చేసుకొని తప్పుడు వ్యాఖ్యలు.. తప్పుడు వాదనలు.. తప్పుడు విధానాలతో పరువు నష్టం కలిగించే పోస్టులపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి న్యాయపోరాటానికి తెర తీశారు. తమపై తప్పుడు పద్దతిలో ప్రచారమవుతున్న పోస్టులను.. వీడియోను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అందుకు వేదికలుగా మారిన మెటా ప్లాట్ ఫామ్స్.. ఎక్స్ కార్పొరేషన్..యూట్యూబ్.. గూగుల్ కు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు.. తప్పుడు కథనాలతోనూ.. పోస్టులతో ప్రచారం చేస్తున్న రెండు వెబ్ సైట్లకు కూడా నోటీసులు పంపారు.
తమ రాజకీయ ప్రత్యర్థులు ఐటీ సెల్ ప్రారంభించి తప్పుడు ప్రచారానికి తెర తీయటం ద్వారా తాము బాధితులుగా మారినట్లుగా ఆమె పేర్కొన్నారు. అన్ని పరిమితులు.. పరిధులు దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని సాగుతున్నారని.. వారి పోస్టులు తమ పరువుకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాను ప్రస్తావించిన కొన్ని వెబ్ సైట్ల పేర్లు.. వాటిలో పబ్లిష్ అయిన కథనాలు.. వీడియో క్లిప్పులకు సంబంధించిన యూఆర్ఎల్స్ ను జత చేసింది.
రాజకీయంగా దెబ్బ తీసేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వేదికలుగామారుతున్న అంశాన్ని వివరంగా తెలియజేయటంతో పాటు.. పలు సోషల్ మీడియాలోని కొన్ని అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ.. తాము సూచన చేసిన విధంగా చర్యలు తీసుకోని పక్షంలో.. భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొనటం గమనార్హం.
తాము పంపుతున్న లీగల్ నోటీసులో పేర్కొన్న విధంగా సదరు కంటెంట్ తో పాటు.. తమకు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించటం.. ప్రసారం చేయటం.. వేర్వేరు మాథ్యమాల్లో వాటిని అప్ లోడ్ చేయటం.. స్ట్రీమింగ్ చేయటం.. షేర్ చేయటం లాంటివి కట్టడి చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే ప్రచురించిన.. ప్రసారం చేసిన.. పోస్టు చేసిన తప్పుడు కథనాల్ని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అదే సమయంలో సదరుకంటెంట్ ను తొలగించినట్లుగా ప్రకటించాలని వైఎస్ భారతీరెడ్డి న్యాయవాది ప్రద్యుమన్ పేర్కొన్నారు. మరి.. ఈ లీగల్ నోటీసులకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
