Begin typing your search above and press return to search.

బయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ మిస్టరీ.. ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి

ప్రముఖ తెలుగు యూట్యూబర్, బైక్ రైడర్ బయ్యా సన్నీ యాదవ్ అదృశ్యంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

By:  Tupaki Desk   |   31 May 2025 1:13 PM IST
బయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ మిస్టరీ.. ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి
X

ప్రముఖ తెలుగు యూట్యూబర్, బైక్ రైడర్ బయ్యా సన్నీ యాదవ్ అదృశ్యంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సన్నీని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన తండ్రి రవి స్పందించారు. తన కుమారుడి ఆచూకీ తెలియక ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సన్నీ తండ్రి రవి మాట్లాడుతూ.. "తన కుమారుడికి బైక్‌పై దేశ విదేశాలు తిరగడం తప్ప పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. సన్నీని ఎవరు తీసుకెళ్లారో తమకు తెలియదు. తన కుమారుడు ఉగ్రవాది కాదని, కేవలం బైక్ రైడర్ గా మాత్రమే పాకిస్తాన్‌ను సందర్శించాడని" స్పష్టం చేశారు. సన్నీ ఆచూకీ కోసం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌కు చెందిన సన్నీ యాదవ్ అరెస్టు వార్త అతని స్వగ్రామంలో కలకలం రేపింది.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. సన్నీ యాదవ్‌ను గత రెండు వారాల కిందట పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తుండగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌లో బైక్ రైడ్ పూర్తి చేసి అక్కడ దాదాపు రెండు నెలల పాటు ఉన్న సన్నీ తన పర్యటనకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి పర్యటనలు అధికారుల నిఘా పరిధిలోకి వచ్చాయి. అతని పాకిస్తాన్ పర్యటన వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.

గతంలో కూడా సన్నీ యాదవ్‌పై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసు నమోదైంది. మార్చి 5, 2025న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో అతడి మీద కేసు నమోదైంది. ఆ కేసులో లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ అయింది. సన్నీ విదేశాల్లో ఉండగా, అతని తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే, ఎన్ఐఏ అతడి అరెస్టును ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించకపోవడంతో అతను ఎక్కడున్నాడనే చర్చ, అతడి కుటుంబంలో ఆందోళన కొనసాగుతున్నాయి.