పంజాబ్‌లో టెర్రర్ నెట్ వర్క్ ఛేదించిన పోలీసులు.. మరో యూట్యూబర్ అరెస్ట్
దేశ భద్రతకు సంబంధించిన ఒక కీలక కేసులో మరోసారి పాకిస్థాన్ గూఢచర్యం నెట్‌వర్క్ బయటపడింది.
By: Tupaki Desk | 4 Jun 2025 6:49 PM ISTదేశ భద్రతకు సంబంధించిన ఒక కీలక కేసులో మరోసారి పాకిస్థాన్ గూఢచర్యం నెట్‌వర్క్ బయటపడింది. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ, లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్న ఒక వ్యక్తి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడని తేలింది. పంజాబ్ పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు. అందుకు సంబంధించిన వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మొహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) పాకిస్థాన్ సపోర్టుతో నడుస్తున్న ఒక టెర్రర్ సంబంధిత గూఢచర్యం నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌లో రూపనగర్‌లోని మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ పాలుపంచుకున్నాడని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.
జస్బీర్ సింగ్ 'జాన్ మహల్' అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నాడు. ఈ ఛానెల్‌కు ఏకంగా 11 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. జస్బీర్ సింగ్‌కు పాకిస్థానీ హ్యాకర్లతో మంచి సంబంధాలు ఉన్నాయని, భారతీయ మూలాలున్న పలువురితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని దర్యాప్తులో తేలింది.
ఈ గూఢచర్యం నెట్‌వర్క్‌లో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా పాలుపంచుకున్నట్లు గుర్తించారు. ఆమెను ఇటీవల ఒక గూఢచర్యం కేసులో అరెస్టు చేశారు. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్, జస్బీర్ సింగ్‌ను ఢిల్లీలో జరిగిన ఒక పాకిస్థాన్ నేషనల్ డే కార్యక్రమానికి ఆహ్వానించినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జస్బీర్ సింగ్ పాకిస్థానీ ఆర్మీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
జస్బీర్ సింగ్ 2020, 2021, 2024 సంవత్సరాల్లో మూడు సార్లు పాకిస్థాన్‌ను సందర్శించాడు. అతని వద్ద నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఈ పరికరాల్లో చాలా మంది పాకిస్థానీ ప్రముఖుల కాంటాక్ట్ నంబర్‌లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఈ డేటా మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తోంది. ఈ డేటా ద్వారా ఈ గూఢచర్యం నెట్‌వర్క్ ఎంత పెద్దది.. ఎవరెవరు ఇందులో పాలుపంచుకున్నారు అనే పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
