Begin typing your search above and press return to search.

ఓటు హక్కుపై ఆసక్తి చూపని యువత... తెరపైకి షాకింగ్ డిటైల్స్!

ఈ క్రమంలో దేశానికి వెన్నెముఖ అయిన యువత ఈ విషయంలో ఆసక్తి చూపడం లేదనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది

By:  Tupaki Desk   |   12 April 2024 7:17 AM GMT
ఓటు హక్కుపై ఆసక్తి చూపని యువత... తెరపైకి షాకింగ్ డిటైల్స్!
X

చాలా మందికి ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం.. ఇక్కడ సగటు ప్రజానికానికి ఉన్న అత్యంత గౌరవం, ప్రాథమిక హక్కుల విలువ చాలా మందికి తెలియదని అంటుంటారు. నియంతల పాలనలో మగ్గుతున్న దేశంలోని ప్రజలను కదిపే అవకాశం ఉన్నా.. లేక, వారి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసినా.. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు ఉన్నంతలో ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు.. వారి వారి అభిప్రాయాలకు ఆ దేశంలో ఎంత విలువ ఉంటుందనే విషయం మరింత స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు.

అవును... భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాలో ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. వాటిలో ప్రాథమిక హక్కులతో పాటు అత్యంత కీలకమైన ఓటు హక్కు ఇక్కడ ప్రజలకు ఉంది. ఈ దేశాన్ని ఎవరు పాలించాలి.. తమకు ఎవరు సేవకులుగా ఉండాలి అని నిర్ణయించుకునే హక్కు సగటు పౌరుడిగా మైనారిటీ తీరిన ప్రతీ పౌరుడికీ ఇచ్చింది ఈ దేశ రాజ్యాంగం! ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది.

ఈ క్రమంలో దేశానికి వెన్నెముఖ అయిన యువత ఈ విషయంలో ఆసక్తి చూపడం లేదనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. అయితే... ఈ విషయంలో కొత్తగా ఓటు హక్కు అర్హత వయసులోకి ప్రవేశించిన యువత మాత్రం అనాసక్తిగా ఉంటున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం... దేశంలోని యువత ఓటు హక్కుకు ధరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ఓటు హక్కు కోసం యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఎన్నికల సంఘం. అయితే ఆ ఓటు హక్కు విలువ తెలియని అజ్ఞానమో.. ఓటు వేయకపోవడం ఫ్యాషన్ అనే అర్ధజ్ఞానమో తెలియదు కానీ... ఇప్పటివరకూ 40శాతం కంటే తక్కువ మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు!

దీంతో.. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని అంటున్నారు పరిశీలకులు. ఈదేశ భవిష్యత్తును నిర్ణయించే, నిర్ధేశించే పాలకులను ఎన్నుకునే విషయంలో యువత ఇంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నా.. యువత తీరు కలవరపరిచేలా ఉందని చెబుతున్నారు! ఈ విషయంలో తల్లితండ్రులు కూడా వారి వారి పిల్లలకు కాస్త మెలుకువ తెప్పించాలని కోరుతున్నారు.