Begin typing your search above and press return to search.

వయసు 27 ఏళ్లు.. ఆస్తి రూ.9,800 కోట్లు!

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ యువ బిలియనీర్... 2023 మేలో "జైబర్ 365" అనే స్టార్టప్ కంపెనీని స్థాపించాడు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:15 AM GMT
వయసు 27 ఏళ్లు.. ఆస్తి రూ.9,800 కోట్లు!
X

"కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు" అన్నట్లుగా "టాలెంట్ ఉంటే.. దాన్ని పక్కాగా అమలు చేస్తే ధనవంతులు అవుతారు.. బిలియనీర్లుగా నిలుస్తారు"! ఇది అక్షరాలా సత్యమని నిరూపించాడో యువ వ్యాపారవేత్త.. ఇతడి పేరు పెరల్ కపూర్! వయస్సు కేవలం 27 ఏళ్లు! అతడి సక్సెస్ గురించి వింటే ఎవరైనా అబ్బురపోవాల్సిందే. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన ఈ యువ పారిశ్రామిక వేత్త... రికార్డ్స్ సృష్టించాడు!!

అవును... సాధారణంగా బిలియనీర్లు అనే మాట వస్తే ఇండియాలో ప్రధానంగా వినిపించే పేర్లు ముఖేష్ అంబానీ, గౌతం అదాని, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యం కూడా ఉండటంతోపాటు.. ఎన్నో ఏళ్ల శ్రమ కూడా ఉండటంతో ఈ స్థాయికి ఎదిగారు. అయితే ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే సక్సెస్‌ స్టోరీలను తిరగరాశాడు ఒక యువ పారిశ్రామికవేత్త. ఎవరు ఆ వ్యక్తి, అతడు చేసిందేమిటి, సాధించిందేమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ యువ బిలియనీర్... 2023 మేలో "జైబర్ 365" అనే స్టార్టప్ కంపెనీని స్థాపించాడు. దీని హెడ్ ఆఫీసు లండన్‌ లో ఉన్నప్పటికీ... అహ్మదాబాద్ నుంచి ఈ కంపెనీ కార్యాకలాపాలతో మరింత ప్రాచుర్యాన్ని పొందింది. "జైబర్ 365" అనేది వెబ్3, ఏఐ-ఆధారిత ఆపరేటింగ్ సిస్టంస్ స్టార్టప్ కంపెనీ. ఇది కేవలం మూడు నెలల వ్యవధిలోనే రూ.9,840 కోట్లకు ఎగబాకింది.

వాస్తవానికి ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీని "యునికార్న్" అంటారు. అయితే... ఈ కంపెనీ కేవలం మూడు నెలల వ్యవధిలోనే "యునికార్న్‌"గా ఆవిర్భవించింది. లండన్‌ లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ.. ఆసియాలోనే అత్యంత వేగవంతమైన యునికార్న్‌ గా ప్రశంసలందుకుంటోంది.

క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుంచి ఎం.ఎస్‌.సీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కపూర్... వ్యాపార ప్రపంచంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందుకునేలా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ముందుగా ఏ.ఎం.పీ.ఎం. స్టోర్‌ లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌ గా మొదలైన అతని ప్రయాణం.. అనంతరం యాంటీయర్ సొల్యూషన్స్‌ కు బిజినెస్ అడ్వైజ ర్‌‌ గా కూడా పనిచేశాడు.