Begin typing your search above and press return to search.

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. కారణం డ్రగ్సా లేక రీల్సా?

ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకున్న మత్తులోనో, రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలన్న మైకంలోనే చేస్తున్న కొన్ని 'పిచ్చి' పనులు షాకింగ్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jun 2025 1:14 PM IST
రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. కారణం  డ్రగ్సా లేక రీల్సా?
X

ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకున్న మత్తులోనో, రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలన్న మైకంలోనే చేస్తున్న కొన్ని 'పిచ్చి' పనులు షాకింగ్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రహదారులపైనా, రైల్వే ట్రాకులపైనా వీరు చేసే స్టంట్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా రైలు పట్టాలపై కారు నడిపిన యువతి వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి హల్‌ చల్ చేసింది. ఇందులో భాగంగా... కారును ఏకంగా రైలు పట్టాలపై నడిపింది. నాగులపల్లి నుంచి శంకర్‌ పల్లి వెళ్లే మార్గంలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ తీవ్ర భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది. దీంతో రైళ్లను ఆపినట్లు తెలుస్తోంది.

నాగులపల్లిలో రైలు పట్టాలపై కారుతో దూసుకుపోతున్న యువతిని వ్యవహారాన్ని గమనించిన స్థానికులు తొలుత అడ్డగించారు. సరిగ్గా ఇదే సమయంలో పట్టాలపై కారును గమనించిన లోకోపైలట్ రైలును నిలిపేశారు. ఇలా ఆమె చేసిన నిర్వాకం వల్ల గంటల తరబడి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని చెబుతున్నారు.

స్థానికులు ఎంత పిలుస్తున్నా వేగంగా దూసుకుపోయిన ఆ యువతి కారు సడన్ గా పట్టాలపై ఆగిపోయింది. దీంతో.. రంగంలోకి దిగిన స్థానికులు ఆ యువతిని పట్టుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. సదరు యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.

ఈ సందర్భంగా.. తాము ఏమి అడిగినా ఎలాంటి సమాధానం చెప్పకుండా యువతి మౌనంగా ఉంటుందని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆమెను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ఆమెను ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన రబిక సోనీగా గుర్తించారని అంటున్నారు.

అయితే.. ఆమె ఈ పనికి పూనుకోవడానికి కారణం రీల్స్ అని ఒకరంటే.. రీల్స్ కాకపోవచ్చు.. డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని మరికొందరు సందేహిస్తున్నారు. ఇదే సమయంలో.. ఆత్మహత్యకు ప్రయత్నించిందా.. లేక, ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతుందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే... ఆమె హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉద్యోగి అని, అయితే కొన్ని నెలల క్రితం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని.. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. ఆ కారణంగా విపరీతంగా మద్యం సేవించి ఇలా రైలు పట్టాలపై రయ్ రయ్ మందనే ప్రచారమూ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.