Begin typing your search above and press return to search.

విషాదం... భార్య వేధింపులతో జడ్జి ఆత్మహత్య!

30 ఏళ్లకే జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఒక ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగిసిపోవడం పట్ల న్యాయవాద సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

By:  A.N.Kumar   |   3 May 2026 12:32 PM IST
విషాదం... భార్య వేధింపులతో జడ్జి ఆత్మహత్య!
X

దిల్లీలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన న్యాయ వ్యవస్థను.. దేశ రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న 30 ఏళ్ల యువ జడ్జి అమన్ కుమార్ శర్మ బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఉన్నత విద్యను అభ్యసించి, సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్న హోదాలో ఉండి కూడా ఆయన ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు.. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసులు.. ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. అమన్ కుమార్ శర్మ శనివారం తన నివాసంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఉదయం నుంచి ఆయన గది నుండి బయటకు రాకపోవడం, ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గమనించగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

కుటుంబ కలహాలే కారణమా?

ఈ ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అమన్ కుమార్ శర్మ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి భార్య వేధింపులే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అమన్ భార్య కూడా న్యాయాధికారిణిగా పనిచేస్తుండటం గమనార్హం. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో కుటుంబ కలహాలు, విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం.

అమన్‌ తండ్రి ఆరోపణల ప్రకారం.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ వివాదంలో అమన్ భార్య సోదరి, ఆమె భర్త (ఐఏఎస్ అధికారులు) జోక్యం చేసుకుని అమన్‌ను మానసిక ఒత్తిడికి గురిచేశారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తుల ఒత్తిడిని తట్టుకోలేక, సమాజంలో పరువు పోతుందన్న ఆవేదనతోనే అమన్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తండ్రి వాపోయారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ఈ కేసులో ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అమన్ ఏదైనా సుసైడ్ నోట్ రాశారా? అన్న కోణంలో వెతుకుతున్నారు. మృతుడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, సోషల్ మీడియా అకౌంట్లు .. చివరిగా మాట్లాడిన కాల్ రికార్డులను పోలీసులు విశ్లేషిస్తున్నారు. చివరి నిమిషంలో ఆయన ఎవరితోనైనా గొడవ పడ్డారా లేదా ఎవరికైనా సందేశాలు పంపారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అమన్ భార్యను, ఆమె కుటుంబ సభ్యులను విచారించడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. అలాగే సహచర న్యాయమూర్తులను కూడా కలిసి.. గత కొన్ని రోజులుగా అమన్ ప్రవర్తనలో ఏవైనా మార్పులు గమనించారా అని ఆరా తీస్తున్నారు.

న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ

న్యాయమూర్తిగా ఇతరులకు న్యాయం చేసే వ్యక్తి, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోవడం న్యాయ వ్యవస్థపై పని ఒత్తిడి మరియు వ్యక్తిగత సమస్యల ప్రభావంపై చర్చకు దారితీసింది. 30 ఏళ్లకే జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఒక ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగిసిపోవడం పట్ల న్యాయవాద సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

ప్రస్తుతానికి పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు. భార్య వైపు నుంచి వస్తున్న ఆరోపణలు, తండ్రి చేసిన ఫిర్యాదు ఆధారంగా వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ కేసు దిల్లీ న్యాయవ్యవస్థలోను.. ఐఏఎస్ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. అమన్ కుమార్ శర్మ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.