Begin typing your search above and press return to search.

'జ్ఞాన వాపి'ని మ‌సీదు అని పిల‌వ‌డ‌మే వివాదం.. ఇది చారిత్ర‌క త‌ప్పిదం!

ఇదే పెద్ద చారిత్ర‌క త‌ప్పిద‌మ‌ని పేర్కొన్నారు. ''మీరు దీనిని మ‌సీదు అని పిలిస్తే.. అదే పెద్ద వివాదం.

By:  Tupaki Desk   |   31 July 2023 2:32 PM GMT
జ్ఞాన వాపిని మ‌సీదు అని పిల‌వ‌డ‌మే వివాదం.. ఇది చారిత్ర‌క త‌ప్పిదం!
X

యూపీలోని ప‌ర‌మ ప‌విత్ర కాశీ విశ్వ‌నాథుడు కొలువైన వార‌ణాసిలో ఈ క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న జ్ఞాన‌వాపి(జ్ఞానాన్నిచ్చే బావి) మ‌సీదుపై నెల‌కొన్న వివాదం రెండేళ్లుగా దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ముగ్గురు స్థానిక మ‌హిళ‌లు.. ఇక్క‌డ శివ‌లింగం ఉంద‌ని.. తాము పూజ‌లు చేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ.. స్థానిక కోర్టులో పిటిష‌న్ వేసిన నాటి నుంచి ఈ వివాదం తెర‌మీదికి రావ‌డం తెలిసిందే. ఇక ఇక్క‌డ అస‌లు ఏముందో లోతుగా ప‌రిశీలించాల‌ని ఆదేశిస్తూ.. స్థానిక కోర్టు.. పురావ‌స్తు శాఖ అధికారుల‌కు కొన్నాళ్ల కింద‌ట ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇటీవ‌ల పురావ‌స్తు అధికారులు పోలీసుల భ‌ద్ర‌త మ‌ధ్య త‌వ్వ‌కాల‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఇంత‌లోనే జ్ఞాన‌వాపి మ‌సీదు ట్ర‌స్టీలు.. ఈ విష‌యాన్ని అల‌హాబాద్ హైకోర్టులో స‌వాల్ చేశారు. దిగువ కోర్టు ఇచ్చిన త‌వ్వ‌కాల ఉత్త‌ర్వుల‌ను నిలిపి వేయాల‌ని కోరారు.

దీనిని విచారించిన కోర్టు బుధ‌వారం వ‌ర‌కు నిలిపివేసింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ విష‌యంపై స్పందించి న యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ్ఞాన‌వాపిని అస‌లు మ‌సీదు అన‌డ‌మే పెద్ద వివాద‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇదే పెద్ద చారిత్ర‌క త‌ప్పిద‌మ‌ని పేర్కొన్నారు. ''మీరు దీనిని మ‌సీదు అని పిలిస్తే.. అదే పెద్ద వివాదం. నేనేమ‌నుకుంటున్నానంటే.. దేవుని అనుగ్ర‌హం ఉన్న ఎవ‌రైనా వ‌చ్చి..ఇక్క‌డ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేయాలి. ముఖ్యంగా ముస్లిం వ‌ర్గాలు జోక్యం చేసుకుని ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించాలి. ఎందుకంటే.. అక్క‌డ ఒక త్రిశూలం ఉంది. దానిని ఎవ‌రూ పెట్ట‌లేదు. అక్క‌డ జ్యోతిర్లింగం ఉంది. అదేవిధంగా దేవుని ప్ర‌తిమ కూడా ఉంది'' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ''జ్ఞాన‌వాపి గోడ‌ల‌పై ఏదో రాసి ఉంది. ఇది తెలుసుకోకుండా.. ముస్లిం స‌మాజం చారిత్ర‌క త‌ప్పు చేస్తోంద‌ని అనుకుంటున్నా. మ‌నం దీనికి ప‌రిష్కారం క‌నుగొనాలి'' అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే: అస‌దుద్దీన్

కాగా, సీఎం యోగి వ్యాఖ్య‌ల‌పై హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముఖ్య‌మంత్రికి అన్నీ తెలిసే ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్య‌లు త‌గ‌వ‌ని ఆయ‌న అన్నారు. పురావ‌స్తు స‌ర్వే విష‌యంపై అల‌హాబాద్ హైకోర్టులో ముస్లింలు పిటిష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ జ‌రిగి, తీర్పు వెలువ‌డాల్సి ఉందని, ఇలాంటి స‌మ‌యంలో న్యాయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌బావితం చేసేలా యోగి వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని అన్నారు.