యూపీ బెంగాల్ సేమ్ టూ సేమ్ : యోగీ బాటలోనే సువేందు !
ఆయన హవాతోనే తొలిసారి బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. దాంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి కేంద్ర బీజేపీ పెద్ద రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టింది.
By: Satya P | 19 May 2026 9:45 AM ISTయూపీలో తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉన్నారు యోగి ఆదిత్య నాధ్. 2017 లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగికి ఉత్తర ప్రదేశ్ లో ఉన్న పలుకుబడి ఎక్కువ. ఆయన హవాతోనే తొలిసారి బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. దాంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి కేంద్ర బీజేపీ పెద్ద రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టింది. తనదైన శైలితో బుల్డోజర్ పాలనతో యూపీలో లా అండ్ ఆర్డర్ కి కంట్రోల్ లోకి తెచ్చారు. ఇక 2022 లో మరోసారి బీజేపీ అక్కడ గెలిచింది. అలా రెండోసారి సీఎం అయిపోయారు యోగీ. ఆయన 2027 లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. దాంతో ఆయన రాజకీయ వేగం ఒక్క లెక్కన సాగుతోంది. ఆయన నిర్ణయాలు ఎపుడూ దేశమంతా చర్చగానే ఉంటాయి. లేటెస్ట్ గా ఆయన రోడ్లపైన నమాజ్ నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రోడ్లున్నవి అందుకోసం కాదు :
రోడ్లు వేసినవి ప్రజల రాకపోకల కోసం మాత్రమే అని యూపీ సీఎం యోగి స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడితే ఊరుకోమని తేల్చి చెప్పారు. రోడ్లపై నమాజ్ చేయడంపై ఆయన గట్టిగానే స్పందించారు. రోడ్లను బ్లాక్ చేసి ట్రాఫిక్‌ను దిగ్బంధించే హక్కు ఎవరికీ లేదని యోగి అన్నారు. చట్టం, ప్రభుత్వ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని ఇందులో ఎవరికీ కూడా ఉదాశీనత కానీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని యూపీ సీఎం స్పష్టం చేశారు.
షిఫ్టులుగా చేసుకోవాలి :
ఇక యూపీలో చాలా చోట్ల రోడ్లపై నమాజ్ లను చేయడం వల్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. యూపీలో అలాంటి వాటికి తావులేదని అనుమతించే సమస్య కూడా లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఎక్కడైనా మసీదులలో స్థలం సరిపోని పక్షంలో జనాభాకు తగ్గట్టుగా షిఫ్టుల పద్ధతిలో నమాజ్ చేసుకోవాలని కూడా యూపీ సీఎం సూచించారు. అంతే కాకుండా ఇళ్లతో పాటు ప్రార్థనా స్థలాలలో స్థలాభావం ఉంటే దానికి అనుగుణంగా తమ ప్రార్ధనల సమయాన్ని కూడా సర్దుబాటు చేసుకోవాలని అన్నారు. అంతే తప్ప రోడ్లను ఆక్రమించడం ఎంత మాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఆయన వెల్లడించారు.
యోగీ బాటలోనే సువేందు :
ఇక యోగీ బాటలోనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు సువేందు అధికారి కూడా దూకుడుగా వ్యవహరిస్తునారు. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లపై నమాజ్‌లను అనుమతించడాన్ని యోగీ తప్పు బట్టడంతో ఇపుడు సువేందు అధికారి కూడా కఠినంగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త మంత్రివర్గం తాజాగా నిర్ణయాలు రాష్ట్రంలో సంచలంగా మారుతున్నాయి.
వాటిని నిలిపివేస్తాం :
కీలకమైన నిర్ణయంగా సువేందు అధికారి ప్రభుత్వం తీసుకున్న దాని మీద బెంగాల్ లో చర్చ సాగుతోనిద్. మదర్సా శాఖ, సమాచార, సాంస్కృతిక శాఖల పరిధిలో ఇన్నాళ్లూ కొనసాగుతున్న మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను ఒక్కోటిగా దశలవారీగా పూర్తిగా నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో వస్తూనే సువేందు అధికారి తన కత్తికి పదును పెట్టారని అంటున్నారు. ఆయన సైతం యోగి బాటలోనే నడుస్తూ బెంగాల్ లో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. సువేందు అధికారి కూడా ఇపుడు కాషాయ వస్త్రాలతో మరో యోగిగా కనిపిస్తున్నారు. దాంతో యూపీలో గురువు యోగీ చేసిన దానిని సేమ్ టూ సేమ్ బెంగాల్ లో సువేందు చేస్తారు అని అంటున్నారు.
