'యోగా' ఒక పెద్ద బిజినెస్!
పవిత్ర భారత గడ్డపై పుట్టి.. యోగులు, మునులచే పరిఢవిల్లిన యోగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
By: Tupaki Desk | 22 Jun 2025 8:15 AM ISTపవిత్ర భారత గడ్డపై పుట్టి.. యోగులు, మునులచే పరిఢవిల్లిన యోగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. నేడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 175 దేశాల్లో ఈ వేడుక జరగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రాచీన కాలంలో సంపూర్ణ జీవన విధానంగా, ఆధ్యాత్మిక సాధనంగా పరిగణించే యోగాపై లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ప్రకృతితో మమేకమై మానసిక అలజడులను, ఆలోచనలను అదుపు చేసి.. ప్రశాంతతను, ఏకాగ్రతను సాధించడానికి అభ్యసించే యోగా.. ఆధునిక కాలంలో చాలా మారిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ ఫిట్ నెస్ ట్రెండ్స్ లో ఒకటిగా మారింది యోగా. దీంతో... యోగా ఇప్పుడు రూ.లక్షల కోట్ల వ్యాపారంగా ఎదిగిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... 2023లో ప్రపంచ యోగా పరిశ్రమ విలువ సుమారు 107.1 బిలియన్ డాలర్లుగా ఉందని చెబుతున్నారు. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే... 2030 నాటికి యోగా బిజినెస్ సుమారు 9.4శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 2025 చివరి నాటికి $215 బిలియన్స్ నుంచి $370 బిలియన్స్ వరకు చేరుకుంటుందని అంటున్నారు.
ఈ క్రమంలో.. గడిచిన దశాబ్ధ కాలంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ అడుగుపెట్టిన యోగాతో.. రకరకాల బిజినెస్ మోడళ్లు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగా... యోగాశ్రమాలు, ట్రైనింగ్ సెంటర్లు వంటివి నిర్వహిస్తూ.. చాలా మంది దీన్ని అద్భుతమైన ఆదాయ వనరుగా మలచుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఫీజులు భారీగానే ఉంటాయని అంటున్నారు.
ఇక సర్టిఫైడ్ యోగా ఇన్ స్ట్రక్టర్స్ కోర్సు కోసం డిమాండ్ కూడా భారీగా పెరిగిందని అంటున్నారు. ఈ ప్రత్యేక టీచర్ ట్రైనింగ్ కోసం.. 200 గంటల నుంచి 500 గంటల ప్రత్యేక ట్రైనింగ్ కోర్సులు ఉండగా... వాటికి ఫీజులు కూడా భారీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఈ కోర్సులకు ఫీజులు.. రూ.90,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది. ఇవి కూడా యోగాశ్రమాలను బట్టి మారుతున్నాయి!
ఇదే సమయంలో... యోగా చేసేటప్పుడు కంఫర్ట్ పెంచడంతోపాటు, గాయాలు కాకుండా జాగ్రత్త పడేందుకు మార్కెట్ లో పలు రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా... యోగా స్ట్రాప్స్, యోగా బ్లాంకెట్స్, యోగా మ్యాట్స్, యోగా సాక్స్ - గ్లోవ్స్ వంటి వాటిని యోగా చేసేటప్పుడు వినియోగిస్తున్నారు. వీటితో పాటు యోగాకు ప్రత్యేకమైన దుస్తులతో కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
