యుద్ధాన్ని మించిన అంతర్యుద్ధం.. మూడు ముక్కలవుతున్న ఓ దేశం!
ఉక్రెయిన్-రష్యా, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాలు గత ఏడాది ప్రపంచాన్ని వణికించాయి. కొత్త ఏడాదిలో అయినా ప్రశాంతత దొరుకుతుందని భావిస్తే మరో దేశం అంతర్యుద్ధం అంచున నిలిచింది.
By: Tupaki Desk | 3 Jan 2026 1:12 PM ISTఉక్రెయిన్-రష్యా, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాలు గత ఏడాది ప్రపంచాన్ని వణికించాయి. కొత్త ఏడాదిలో అయినా ప్రశాంతత దొరుకుతుందని భావిస్తే మరో దేశం అంతర్యుద్ధం అంచున నిలిచింది. ఇప్పటికే రెండు వర్గాలు దేశాన్ని పంచుకుని పాలిస్తుండగా.. మరో రెండు దేశాలు తమ జోక్యంతో పరిస్థితిని పెనం మీద నుంచి పొయ్యిలోకి పడేసేలా ఉన్నాయి. ఇదంతా నిత్యం రగులుతూ ఉండే పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతుండడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మనం చెప్పుకోబోయే దేశం పేరు యెమెన్. దీనిచుట్టూ ఉన్న శక్తిమంతమైన దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). యెమెన్ వ్యవహారంలో చెరోవైపు నిలిచి ఇప్పుడు ఆ రెండూ గొడవ పడేలా ఉన్నాయి.
ఒకే దేశం.. మూడు ప్రభుత్వాలు...!
యెమెన్... 12 ఏళ్లుగా అంతర్యుద్ధంలో నలుగుతున్న దేశం. అప్పట్లోనే ప్రధాన నగరం సనాను హూతీ రెబెల్స్ తమ వశం చేసుకున్నారు. ఉత్తర ప్రాంతాన్ని అంతటినీ ఆధిపత్యంలోకి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో మరో ప్రభుత్వం ఐఆర్జీ నడుస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐఆర్జీ పాలక మండలిలో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్టీసీ) కీలక భాగస్వామి. అయితే, ఎస్టీసీ ఇప్పుడు దక్షిణ యెమెన్ ను తమకు ఇచ్చేయాలంటోంది. ఆ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ, నెల రోజుల నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తోంది. వీటిలో ఆయిల్ రిసోర్సులు అధికంగా ఉండడంతో పరిస్థితి తీవ్రత పెరిగింది.
సౌదీ, యూఏఈ చెరోవైపు..
యెమెన్ ప్రభుత్వానికి సౌదీ, ఎస్టీసీకి యూఏఈ మద్దతు ఇస్తున్నాయి. ఇక మరోవైపు హూతీల ఆధీనంలో కొంత యెమెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ హూతీలకు వ్యతిరేకంగా ఉండే గ్రూపులను సౌదీ, యూఏఈలే కలిపాయి. యెమెన్ ను సమైక్యంగా ఉంచాలని సౌదీ చూస్తోంది. ఎస్టీసీ కారణంగా హూతీలపై పోరాటం బలహీనం అవుతుందని భావిస్తోంది. సౌదీ సరిహద్దుల్లోని యెమెన్ భూభాగాలను ఎస్టీసీ ఆధీనంలోకి తీసుకుంటోంది. అందుకే ఆ దేశం కలవరం చెందుతోంది. ఎస్టీసీని వెళ్లిపోవాలని కోరినా తిరస్కరించింది. ఈ సంస్థ వెనుకు ఉన్నది యూఏఈ అని సౌదీ భావిస్తోంది. ఆ దేశం ఆయుధాలతో పంపిన నౌక ముకల్లా పోర్టుకు చేరుకుందని తెలిసి దాడులు చేసింది. అనంతరం తమ దేశంలోని సైనిక బలగాలను యూఏఈ వెనక్కుతీసుకోవాలని యెమెన్ ప్రభుత్వం ఆదేశించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇక సౌదీ శుక్రవారం హద్రమౌత్ పై బాంబులు వేసింది. ఎస్టీసీతో ఆ దేశ దళాలు గ్రౌండ్ లెవెల్ లో పోరాటం చేస్తున్నాయి. దీంతో యెమెన్ మూడు ముక్కలు అవుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
