Begin typing your search above and press return to search.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం...విపక్షాలకు షాక్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాలు ఒక విధంగా అలవాటుగా మారిపోయాయి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Aug 2023 5:36 PM IST
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం...విపక్షాలకు షాక్
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాలు ఒక విధంగా అలవాటుగా మారిపోయాయి అని అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికతతో మొదలెట్టిన ఈ విజయపరంపర అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ విజయ దుందుభి మోగించింది. 2024 ఎన్నికలు మరో ఏడెనిమిది నెలలలో ఉన్నాయనగా జరిగిన ఈ ఉప ఎన్నికలు నిజంగా వైసీపీకి టానిక్ లాంటివి. అదే టైంలో ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉందో చాటి చెప్పయి. నూటికి ఎనభై అయిదు శాతానికి పైగా ఫలితాలు వైసీపీ పరం కావడం అంటే ఇది మామూలు విజయం కాదు అని అంటున్నారు.

ఎన్నికలు ఎపుడు పెట్టినా మేమే అధికారంలోకి వస్తామని చెబుతున్న విపక్షాలు జస్ట్ పైదిహేను నుంచి ఇరవై శాతం ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రూరల్ బేస్ లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకూ చూస్తే మొత్తం అంతటా ఒకే విధంగా ఈ ఫలితాలు ఉండడం విశేషం.

ఉభయ గోదావరి జిల్లాలతో వైసీపీకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే అక్కడ కూడా పంచాయతీలలో వైసీపీ పాగా వేయడం విశేషం. మరి విపక్షాల గ్రాఫ్ పెరిగింది అని చెప్పుకుంటున్న వేళ ఎక్కడా ఏ జిల్లాలోనూ సాలిడ్ గా తన ప్రభావాన్ని చూపించలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే మొత్తం రాష్ట్రంలోని 26 జిల్లాలలో 66 సర్పంచు పదవులకు ఉప ఎన్నికలు జరిగితే అందులో 53 స్థానాలు వైసీపీ గెలుచుకోగా కేవలం పది చోట్ల టీడీపీ ఒకచోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. ఇక 1062 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిసి 810 స్థానాల్లో వైసీపీ బలపరిచిన విజయం సాధించగా తెలుగుదేశం 182 స్థానాల్లో, జనసేన ఏడు చోట్ల గెలిచాయి.

ఇదే ఇపుడు వైసీపీలో గెలుపు ధీమాను మరింతగా పెంచుతోంది అని అంటున్నారు. ఇక ఈ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే చంద్రబాబు సొంత సీటు కుప్పంలోనూ, నందమూరి బాలక్రిష్ణ సొంత సీటు హిందూపురంలోనూ వైసీపీ జెండా పాతడమే విశేషం. చంద్రబాబు సారధ్యం వహిస్తున్న కుప్పంలో ఆరు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఇల్లు నిర్మిస్తున్న శాంతిపురం మండలం, శివపురం వార్డు సైతం వైసిపి ఖాతాలోకి వెళ్ళింది.

అలాగే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో సైతం చలివెందుల పంచాయతీ సర్పంచ్ స్థానం వైసీపీ ఎగరేసుకుపోయింది. దీంతో మున్ముందు ఎన్నికల్లో తాము గెలుస్తాం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం అసలు గల్లంతయినట్లు స్పష్టమైంది అని అంటున్నారు. ఇక మొత్తంగా చూస్తే 66 పంచాయతీ సర్పంచులలో ఏకగ్రీవాలు ఎన్నికలు కలుపుకుని వైసీపీ 53 సీట్లలో విజయ ఢంకా మోగించింది. అలాగే మొత్తం 1062 వార్డులలో ఏకగ్రీవాలు 756 జరిగాయి. ఎన్నికలు జరిగిన వాటితో కలుపుకుని వైసీపీ మొత్తంగా 810 వార్డులు గెలుచుకుంటే టీడీపీ 182 గెలుచుకుంది. జనసేన 7 వార్డులలో విజయం సాధించింది.

ఈ విధంగా చూస్తే మాత్రం వైసీపీకి 2024 ఎన్నికల ముందు వచ్చిన ఈ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు తిరుగులేని విజయాన్ని మళ్ళీ అందిస్తాయని పూర్తిగా చెప్పేశాయి. అదే టైం లో విపక్షాలు ఎంతగా ప్రచారం చేసినా మరెంతగా జనంలోకి వెళ్లినా ప్రజలు అధికార వైసీపీ పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారని తెలియచెప్పాయి.

వైసీపీ మీద ఇంతటి విశ్వాసం ఉండడానికి కారణం అభివృద్ధి సంక్షేమం అని విశ్లేషిస్తున్నారు. ఇక మరో విశిష్టత కూడా ఉంది. పంచాయతీలకు, వార్డులకు ఉపఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపింది. ఆ జిల్లా ఈ జిల్లా ఆ ప్రాంతం అని లేకుండా రాష్ట్రం నాలుగుచెరగులా వైసిపి దూసుకుపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తోబాటు అభివృద్ధి ప్రాజెక్టులు పరిశ్రమల వంటివి ప్రజలు వైసీపీ పట్ల సానుకూలంగా స్పందించడానికి కారణం అయ్యాయని అంటున్నారు.

ఇక ఇప్పటివరకూ చూస్తే అనేక జాతీయ సర్వేలు సైతం ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చాటి చెబుతూనే ఉన్నాయి. ఇపుడు అసలైన సర్వే అన్నట్లుగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఈ ఎన్నికలు ఏపీ మొత్తం మీద అంతటా జరిగిన ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు జనం ఇచ్చిన ముందస్తు తీర్పుగా అసలైన ప్రజా సర్వేగా ఉన్నాయని అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే వైసీపీకి తిరుగేలేదు అన్నది మళ్లీ రుజువు అయింది అని అంటున్నారు. విపక్షాలను టోటల్ గా ఈ ఫలితాలతో డీలా పడినట్లుగానే తెలుస్తోంది. పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా విపక్షాలు వైసీపీ దరిదాపులలో రాలేవని కూడా ఈ ఫలితాలు తెలియచేస్తున్నాయని అంటున్నారు. ఇది వైసీపీ ఘన విజయం అని అంటున్నారు.