Begin typing your search above and press return to search.

వీరు నలుగురూ వారు నలుగురూ...వైసీపీ వర్సెస్ టీడీపీ...!

వైసీపీ నుంచి టీడీపీ వైపు జంప్ చేసిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. సరిగ్గా అదే నంబర్ తో టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్ళిన మరో నలుగురు ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:38 AM GMT
వీరు నలుగురూ వారు నలుగురూ...వైసీపీ వర్సెస్ టీడీపీ...!
X

వైసీపీ నుంచి టీడీపీ వైపు జంప్ చేసిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. సరిగ్గా అదే నంబర్ తో టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్ళిన మరో నలుగురు ఉన్నారు. వీరి మీద వేటు వేస్తే వారి మీద కూడా వేయాలని టీడీపీ అంటోంది.

ఈ మేరకు బుధవారం స్పీకర్ ని కలసి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. వైసీపీ వైపు నుంచి టీడీపీ వైపు వెళ్ళిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవిల మీద అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తున్న నేపధ్యంలో టీడీపీ తామూ రెడీ అంటోంది.

ఇక టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్ళిన వారిలో కరణం బలరామ క్రిష్ణమూర్తి, వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు ఈ నలుగురూ పార్టీ మారినందుకు అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ని టీడీపీ కోరబోతోంది.

చిత్రమేంటి అంటే టీడీపీ నుంచి వైసీపీ వైపుగా నడచిన వారంతా దాదాపుగా నాలుగేళ్ల క్రితమే వెళ్లారు. ఆనాడు టీడీపీ వారి మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ నాడే చేసి ఉంటే వారి మీద స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు ఆయా సీట్లలో వచ్చి ఉండేవి. అప్పట్లో వైసీపీ అధికారంలో నిండా ఉంది. దాంతో పాటు వరసగా ఉప ఎన్నికల్లో గెలుస్తుంది.

ఎందుకొచ్చిన తంటా అని భావించిందో ఏమో కానీ టీడీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించి వారు ఊసు మరచినట్లు గానే ఉంది. వైసీపీ నుంచి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఓటు వేశారు అని నలుగురు ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ అనర్హత వేటు కోరుతోంది. అయితే ఈ నలుగురు కూడా గత ఏడాది మార్చిలో ఈ రకంగా చేశారు. అంటే దాదాపుగా ఏడాది అవుతోంది. మరి అపుడే ఎందుకు చర్యలకు దిగలేదు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా వస్తోంది.

వారి మీద అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయని భావించి ఊరుకున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక ఇపుడు చూస్తే ఆ నలుగురూ ఈ నలుగురూ ఎవరైనా కూడా ఎమ్మెల్యేలుగా ఉండేది కొద్ది నెలలు మాత్రమే. ఉప ఎన్నికలు అన్నవి అసలు ఉండవు. అసలు ఎన్నికలే వస్తున్నాయి. అందుకే ఇలా అధికార విపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ఈ అనర్హత వేటు అంశాన్ని ముందుకు తెచ్చారా అన్నది ఒక చర్చ. అయితే ఇందులో మరో మతలబు ఉంది. టీడీపీ వైపు ఉన్న నలుగురి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే రాజ్యసభ ఎన్నికల్లో రేపు టీడీపీ పోటీ చేసినా ఆ నంబర్ తగ్గుతుంది.

అందుకే వైసీపీ ఇలా చేస్తొంది అని అంటున్నారు. దాన్ని గ్రహించిన టీడీపీ వైసీపీ వైపు కూడా ఆ నలుగురు నంబర్ ని తగ్గించాలని వేసిన ఎత్తుగడలో భాగమే ఈ ఫిర్యాదు అని అంటున్నారు ఈ రాజకీయ ఎత్తులలో పై ఎత్తులలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.