Begin typing your search above and press return to search.

వద్దు అన్న ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్...?

తాజాగా ఎస్ కోటలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండిని మళ్లీ గెలిపించమని పార్టీ శ్రేణులకు వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 3:45 AM GMT
వద్దు అన్న ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్...?
X

పార్టీలోని వారు వద్దు అని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో గట్టిగా పట్టుబట్టారు. ఇక ఆయన మీద వ్యతిరేకత బాగా పెరిగింది. ఈసారికి టికెట్ కష్టం అని కూడా అంతా భావించారు. ఆయనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలో పెద్ద వర్గమే ఏర్పడింది. పార్టీ అయితే రెండుగా చీలిపోయింది. దాంతో అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటిరా బాబూ అని అంతా అనుకుంటున్న సందర్భం.

ఇదంతా విజయనగరం జిల్లా ఎస్ కోటకు సంబంధించినది. ఎస్ కోట సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విషయంలోనే చర్చ. జిల్లాలో టికెట్ రాదు అంటే కచ్చితంగా చెప్పే మొదటి నియోజకవర్గం ఎస్ కోటగానే ఉంది. అయితే అదే ఎస్ కోటలో ఇపుడు కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ కన్ ఫర్మ్ అయింది.

తాజాగా ఎస్ కోటలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండిని మళ్లీ గెలిపించమని పార్టీ శ్రేణులకు వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. దాంతో కడుబండి వర్గం పండుగే చేసుకుంటోంది. ఇక తిరుగులేదు, మా బాస్ కి టికెట్ ఇచ్చేశారు అని సంతోషం వ్యక్తం చేస్తోంది.

వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ అయ్యాక ఆయనకు ఎక్కువగా తలనొప్పులు వచ్చిన నియోజకవర్గం ఎస్ కోట అనే చెప్పాలి. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘువర్మ అయితే నేరుగా ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీలో అంతా రెండుగా అయిపోయారు.

గత ఎన్నికల్లో ఇందుకూరి రఘువర్మ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు. ఆయన తాను పక్కా లోకల్ అని ప్రోజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే గజపతినగరానికి చెందిన కడుబండిని మంత్రి బొత్స ఎస్ కోటకు చివరి నిముషంలో షిఫ్ట్ చేయించి టికెట్ ఇప్పించారు అని ప్రచారం జరిగింది. ఆయనకు ప్రచారం చేసి పెట్టి మద్దతు ఇవ్వాలని రఘువర్మను అధినాయకత్వం కోరింది.

దానికి బదులుగా పార్టీ అధికారంలోకి వచ్చాక రఘువర్మకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైం లో కడుబండి రఘువర్మని పక్కన పెట్టడం ఆయన వర్గాన్ని పూర్తిగా తొక్కేయడంతో వివాదం కాస్తా ముదిరి ఎస్ కోట వైసీపీ రెండుగా చీలిపోయింది. ఇక రఘువర్మ కడుబండి మీద గత కొన్నేళ్ళుగా బాహాటంగానే పోరాటం చేస్తూ వస్తున్నారు.

ఈసారి కడుబండిని మార్చాల్సిందే అని ఆయన వైవీ సుబ్బారెడ్డికి పలు మార్లు మొర పెట్టుకున్నారు. తనకు కానీ తన సతీమణికి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. కడుబండికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదు అని కూడా స్పష్టం చేశారు. మరి ఇన్ని జరిగినా ఆయనకే టికెట్ కన్ ఫర్మ్ చేసింది వైసీపీ అధినాయకత్వం.

ఇదిలా ఉంటే నాన్ లోకల్ గా ముద్ర ఉన్న కడుబండి గత నాలుగున్నరేళ్ళలఒ పెద్దగా పనిచేసింది లేదని కూడా అంటున్నారు. ఆయన పనితీరు పట్ల ప్రజల్లో పాజిటివిటీ లేదని ప్రచారంలో ఉంది. మరి ఆయనకే మరోసారి టికెట్ అంటే తెర వెనక బొత్స చక్రం తిప్పారని అంటున్నారు. కడుబండికి టికెట్ ఇవ్వకపోతే ఆయన గజపతినగరం వస్తారు. అక్కడ బొత్స సోదరుడు బొత్స అప్పలనరసయ్యకు ఇబ్బందిగా మారుతుంది.

పైగా కడుబండి కూడా బొత్సకు బంధువే. ఇలా అన్ని విధాలుగా సీనియర్ మంత్రి తన చక్రం తిప్పి కడుబండికే టికెట్ వచ్చేలా చూసుకున్నారని అంటున్నరు. మరి ఆయనకు టికెట్ కన్ ఫర్మ్ అయింది. ఎమ్మెల్సీ రఘువర్మ వర్గం సహకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఎందుచేతంటే రఘువర్మకు బలం ఉంది.

ఆయన 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 30 వేల 696 ఓట్లు వచ్చాయి అంటే ఎంత గట్టి లీడరో అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య రాజీ కుదురుందా అది అసాధ్యం అంటున్నారు. మరి పార్టీ పెద్దలు రఘువర్మను ఎలా దారికి తెస్తారో చూడాలి. ఏది ఏమైనా విజయనగరం జిల్లా వరకూ బొత్స చక్రం గిర్రున తిరుగుతోంది అని అంటున్నారు.