మిత్రపక్షానికి షాకిచ్చేలా వైసీపీ నిర్ణయం.. మారుతున్న ఢిల్లీ రాజకీయం!!
అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఊరుకుంటుందా? తన దారిలో తాను కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.
By: Tupaki Desk | 16 Sept 2023 4:00 PM ISTరాజకీయాల్లో శాస్వత శతృవులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో మరోసారి నిరూపితం అయిపోయింది. 2019లో విమర్శించుకున్న టీడీపీ-జనసేనలు ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి చేతులు కలిపి, ఎన్నికల యుద్ధంలో రణ భేరి మోగించేందుకు రెడీ అయ్యాయి. ఇక, వీరి కలయికతో సహజంగానే తటస్థ ఓటు బ్యాంకు అధికార వైసీపీకి దూరమయ్యే అవకాశం కనిపిస్తోందనే అంచనాలు వస్తున్నాయి.
దీనికితోడు ఎలానూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా జనసేన-టీడీపీ ఒడిసి పట్టుకుని విజయం దక్కిం చుకునేందుకు ప్రయత్నం ప్రారంభించే ఛాన్స్ ఎలానూ కనిపిస్తోంది. అయితే, రాజకీయంగా ఇంత జరుగుతుంటే.. అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఊరుకుంటుందా? తన దారిలో తాను కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే.. పైకి ఒంటరి పోరు అంటూనే లోపాయికారీగా.. 'మిత్రులను' చేరదీసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో మిత్రత్వంపై వైసీపీ ప్రకటనలు చేయకపోయినా.. అంతర్గతంగా మాత్రం జరగాల్సింది జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు.. కమ్యూనిస్టు పార్టీ సీపీఎం.. నాయకులు గత మూడున్నరేళ్లుగా వైసీపీకి లోపాయికారీ అండగా ఉంటూ వస్తున్నారు. ఇక, బయట తిడతాం.. లోపల పొగుడుతాం.. అన్నట్టుగా బీజేపీ వ్యవహార శైలి ఉండనే ఉంది. వీరు కాకుండా.. కొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు రెడీగానే ఉన్నాయి.
"ఈ పార్టీల వల్ల ఏం జరుగుతుంది లే!" అని లైట్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే 1000 ఓట్లు చీలినా.. అది వైసీపీకి లబ్ధి చేకూర్చే ప్రక్రియే అవుతుంది. ఇదిలావుంటే, కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీకి ఉన్న సన్నిహిత సంబంధాలను బట్టి.. ఈ పార్టీని టీడీపీ-జనసేన మిత్రపక్షానికి దూరంగా ఉంచాలనే వ్యూహంతోనూ వైసీపీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అందుకే మిత్ర పార్టీ వైఖరిపై బీజేపీ గుంభనంగా ఉంది.
అంటే.. మొత్తంగా వైసీపీ అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే.. టీడీపీ-జనసేన మిత్రపక్షంతో ఇతర పార్టీలు కలవకుండా.. చూడడం ద్వారా తన వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనిచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ ఒంటరి పోరుతోనే ముందుకు సాగుతుండడం వైసీపీకి అంతో ఇంతో కలిసి వచ్చే అంశమే అవుతుందన్నది ఆ పార్టీ నాయకుల అంచనాగా ఉంది. వెరసి మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా వైసీపీ... టీడీపీ-జనసేన మిత్రపక్షానికి షాకిచ్చేలా రాజకీయం చేస్తోందన్నది పరిశీలకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
