Begin typing your search above and press return to search.

కందుల దుర్గేష్ కి కన్ను గీటుతున్న వైసీపీ...!?

కందుల దుర్గేష్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఈస్ట్ గోదావరి పాలిటిక్స్ అయిపోయారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:22 AM GMT
కందుల దుర్గేష్ కి కన్ను గీటుతున్న వైసీపీ...!?
X

తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం అంతా జనసేన వర్సెస్ టీడీపీగా సాగుతోంది. మరి అధికార వైసీపీ సంగతేంటని అంటే తాపీగా ఆ రెండు పార్టీలలో పరిణామాలను గమనిస్తోంది. వీలుంటే అందులో నుంచి ఎంత వస్తే అంత రాజకీయ లాభాన్ని పొందేందుకు కూడా చూస్తోంది. కందుల దుర్గేష్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఈస్ట్ గోదావరి పాలిటిక్స్ అయిపోయారు.

ఆయన జిల్లా జనసేన ప్రెసిడెంట్. ఆయన మంచి మనిషి అని పార్టీలకు అతీతంగా అంతా చెబుతున్న మాట. ఆయన 2019లో జనసేనలో చేరారు. ఒంటరిగా ఆ పార్టీ పోటీ చేస్తే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి దుర్గేష్ ఏకంగా 42 వేల ఓట్లను తెచ్చుకున్నారు. ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందుకంటే 2019లో జగన్ ప్రభంజనం పెద్ద ఎత్తున వీచినా దుర్గేష్ ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకున్నారు అంటే ఆయన స్టామినా ఎలాంటిదో చెబుతోంది.

దాంతో ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు ఖాయం అని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. పైగా పొత్తులు కూడా ఉంటాయి కాబట్టి దుర్గేష్ కి విజయం తప్పదు అని అనుకున్నారు. ఇటీవల రాజమండ్రి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారు అని ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి.

దాంతో జనసేన నేతలు సంబరాలే చేసుకున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. ఆయన మరోసారి గెలిచి తీరుతాను అక్కడ నుంచే పోటీ అని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రాజమండ్రి రూరల్ టికెట్ ని గోరంట్లకు ఇస్తున్నారని కందుల దుర్గేష్ ని నిడదవోలు వెళ్లమన్నారని ప్రచారం సాగింది.

దీనికి కందుల దుర్గేష్ కూడా కన్ ఫర్మ్ చేశారు. కానీ ఆయన అభిమానులు అనుచరులు అయితే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా ర్యాలీలు నిర్వహిస్తున్నారు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సంచలన కామెంట్స్ చేశారు.

కందుల దుర్గేష్ 2019లోనే తమ పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యేవారు అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన తీరు రైట్ మాన్ ఇన్ ద రాంగ్ పార్టీగా ఉంది అని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆయన చాలా కష్టపడి జనసేన పార్టీని నిర్మించారని ఆయనకు అన్యాయమే జరిగింది అని అంటున్నారు.

ఆయనను వైసీపీలో చేరమని ఆహ్వానిస్తున్నట్లుగా కూడా భరత్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన వస్తే తీసుకుంటామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇపుడున్న పరిస్థితులు చూస్తూంటే నిడదవోలులోనూ దుర్గేష్ కి అక్కడ టీడీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దుర్గేష్ అనుచరులు అయితే రాజమండ్రి రూరల్ విడిచి వెళ్లవద్దు అంటున్నారు.

ఈ పీటముడి తెగాలంటే దుర్గేష్ పార్టీ మారుతారా అన్న చర్చ కూడా నడుస్తోంది. కానీ తాను పార్టీ మారను ఇండిపెండెంట్ గా పోటీ చేయను అని చెప్పేశారు. అయితే వైసీపీ మాత్రం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అందుకే తమ పార్టీ ఎంపీ చేత ఈ రకమైన ప్రకటన ఇప్పించింది అని అంటున్నారు. దుర్గేష్ వస్తే వైసీపీలో చేర్చుకుంటామని చెప్పడం అంటే అధికార పార్టీ మాస్టర్ ప్లాన్ తోనే ఉంది అని అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి వేణు గోపాల క్రిష్ణకు టికెట్ ఇచ్చారు.

కానీ ఇపుడు దుర్గేష్ చేరితే ఆయనకు అదే సీటు అకామిడేట్ చేయగలరా అన్నది చర్చ. కానీ వైసీపీలో మాత్రం దుర్గేష్ వస్తే ఇస్తామనే అంటున్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే పావులు చురుకుగా కదుపుతున్నారు. మరి దీని మీద కందుల దుర్గేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జనసేన టీడీపీ పొత్తుల నుంచి వచ్చే ప్రతికూలతలను సొమ్ము చేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.