Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలుగా నో... ఎంపీలుగా ఓకే...?

వైసీపీలో కొందరు నేతల విషయంలో అధినాయకత్వం వేరేగా ఆలోచిస్తోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 2:45 AM GMT
ఎమ్మెల్యేలుగా నో... ఎంపీలుగా ఓకే...?
X

వైసీపీలో కొందరు నేతల విషయంలో అధినాయకత్వం వేరేగా ఆలోచిస్తోంది అని అంటున్నారు. వారు ఎమ్మెల్యేలుగా మళ్లీ పోటీ చేయడానికి కుదరదు అని నిర్ణయిస్తోంది అని ప్రచారం లో ఉన్న మాట. అదే నాయకులు ఎంపీకి మాత్రం వైసీపీ అధినాయకత్వం చురుకుగా పరిశీలించడం విశేషం.

నిజానికి ఎంపీ అంటే ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలోనే పనితీరు బాలేదని అనుకుంటే ఏడు నియోజకవర్గాల ప్రజల మద్దతుని ఎలా పొందుతారు అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం ఒక ఫార్ములా ప్రకారం ఇలా చేస్తోంది అని అంటున్నారు. అదేంటి అంటే కొత్త ముఖం అన్న పాయింట్ తో కూడిన ఫార్ములా. ఎంపీగా కొత్త ఫేస్ గా కనిపిస్తుంది కాబట్టి గెలుపు అవకాశాలు ఉంటాయని అంచనా కడుతోంది.

అలా కనుక చూస్తే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ని మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయించకూడదు అని భావిస్తోందిట. ఆయనకు 2014, 2019లో పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఈసారి ఆయనను శ్రీకాకుళం పార్లమెంట్ కి పోటీకి దించబోతున్నారు అని బలంగా వినిపిస్తున్న మాట.

అదే విధంగా భీమునిపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విషయంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేయబోతున్నారు. ఆయన పనితీరు పట్ల సర్వే నివేదికలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ నుంచి దించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2014లో అనకాపల్లి నుంచే టీడీపీ నుంచి ఎంపీ అయ్యారు. అయితే అవంతి ఎంపీగా పెర్ఫార్మెన్స్ పెద్దగా నాడు లేదు అని విమర్శలు వచ్చాయి. ఇపుడు ఆయన్ని తెచ్చి అదే అనకాపల్లికి ఎంపీగా పంపితే వైసీపీకి ఏమి మేలు జరుగుతుంది అన్నదే చర్చకు వస్తోంది.

అలాగే అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని తెచ్చి పాడేరు ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆమె కూడా ఆ సీటు మీద కన్ను వేశారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఆమెకు పెద్దగా మార్కులు పడలేదని అందుకే ఈ మార్పు అని అంటున్నారు.

అదే విధంగా అమలాపురం ఎంపీ పినిపె విశ్వారూప్ ని తెచ్చి అమలాపురం ఎంపీగా పంపాలని పార్టీ భావిస్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. లోక్ సభ నియోజకవర్గం కేంద్రంలోనే మంత్రికి వ్యతిరేకత ఉంటే ఎంపీగా ఎలా గెలుస్తారు అని సొంత పార్టీలోనే చర్చకు తావిస్తోంది. మంత్రి అయితే మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ అని అంటున్నట్లుగా చెబుతున్నారు. అవసరం అయితే తన కుమారుడిని ఎంపీగా పోటీ చేయిస్తాను అని అంటున్నారుట.

ఇక సిట్టింగ్ ఎంపీ చింతా అనూరాధకు ఏ సీటు ఇస్తారో లేక పక్కన పెడతారో కూడా తెలియడంలేదు అని అంటున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసా కన్నబాబుని తెచ్చి కాకినాడ లోక్ సభకు పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. కన్నబాబు అయితే తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అని అంటున్నారని టాక్. కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీత పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనుండడంతో కాకినాడ ఎంపీ సీటు కన్నబాబుకే అంటున్నారు. ఎమ్మెల్యేగా ఆయన పనితీరు పట్ల హై కమాండ్ అసంతృప్తిగా ఉందని అందుకే ఈ మార్పు అని అంటున్నారు.

ఇదే వరసలో నెల్లూరు నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపీగా పోటీ చేయిస్తారు అని ప్రచారం సాగుతోంది. ఆయన పనితీరు బాలేదని కూడా సర్వే నివేదికలు ఘోషిస్తున్న నేపధ్యంలో ఎంపీకి వెళ్ళమంటున్నారుట.

అయితే అర్ధం కాని విషయం ఏంటి అంటే ఎమ్మెల్యేగా పనితీరు కనబరచని వారిని తెచ్చి ఎంపీలుగా దించినా ఉపయోగం ఏమిటి అన్నదే. మరి హై కమాండ్ కి ఎంపీలుగా రాణిస్తారు అన్న నమ్మకం ఉండబట్టే ప్రమోషన్ ఇస్తోందా అన్న చర్చ ఉంది. అయితే ఎంపీ అంటే ప్రమోషనే కానీ ఇపుడు పార్లమెంట్ కి ఢిల్లీకి వెళ్ళి తాము ఏమి చేయాలని చాలా మంది పోటీకి నో చెబుతున్నారుట. చూడాలి మరి వారిని ఎలా ఒప్పిస్తారో.