Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రి మీద కేంద్రం యాక్షన్ కి దిగుతుందా...?

పెద్దిరెడ్డి ఏకంగా 35 వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని ఆయన అక్రమాల మీద ఈడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:34 PM GMT
వైసీపీ మంత్రి మీద కేంద్రం యాక్షన్ కి దిగుతుందా...?
X

వైసీపీలో ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి. అంతే కాదు, వైసీపీకి ఆయన చాలా ముఖ్యమైనవారు. ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బిగ్ షాట్ గా ఉన్నారు. దాదాపుగా చంద్రబాబుతో సరిసమానంగా ఆయనకూ రాజకీయ అనుభవం ఉంది.

అదే సమయంలో ఆయనకు రాజకీయంగా శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇటీవలే బీజేపీ లోకి చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డికీ పడదు, వారిది దశాబ్దాల వైరం. ఇక చంద్రబాబుతో పెద్దిరెడ్డికి కూడా డెబ్బై దశకం చివర నుంచి ఉన్న రాజకీయ వైరం అలాగే కొనసాగుతోంది.

ఇంకో వైపు చూస్తే కొత్త శత్రువులు కూడా రాజకీయంగా పెద్దిరెడ్డికి పుట్టుకుని వస్తున్నారు ఏపీలో ఇటీవలే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన చిత్తూరు జిల్లాకు చెందిన నాయకుడు రామచంద్ర యాదవ్ తాజాగా కేంద్ర హో మంత్రి అమిత్ షాను కలసి పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు చేశారు.

పెద్దిరెడ్డి ఏకంగా 35 వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని ఆయన అక్రమాల మీద ఈడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇక ఆస్తుల విషయంలో వాటి వివరాలను తెలియచేసే విషయంలో పెద్దిరెడ్డి ఈసీనే తప్పుదోవ పట్టించారు అని రామచంద్ర యాదవ్ ఆరోపించారు.

అంతే కాదు పెదిరెడ్డి పీ ఎల్ ఆర్ కంపెనీపైన 160 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2019 నుంచి 2023 మధ్యలో కంపెనీ ఆదాయం కొన్ని వందల ఎర్టు పెరిగినట్లుగా చూపించారని ఆయన ఫిర్యాదు చేశారు. దీని మీద కూడా చర్యలను ఆయన కోరారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రామచంద్రయాదవ్ కి సాన్నిహిత్యం ఉండడమే కాకుండా ఏకంగా ఏపీకి చెందిన ఒక కీలక మంత్రి మీద ఈ స్థాయిలో ఫిర్యాదు చేయడం పట్ల చర్చ సాగుతోంది. ఆయన 2019లో జనసేన నుంచి పెద్దిరెడ్డి సీటు అయిన పుంగనూరు నుంచి పోటీ చేసి ఓడారు. ఇపుడు పార్టీ పెట్టారు.

ఆయన పెద్దిరెడ్డిని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ రామచంద్ర యాదవ్ వెనక ఉన్న వారు ఎవరు అన్నది చర్చగా ఉంది. అందరికీ ఉమ్మడి శత్రువుగా మారిన పెద్దిరెడ్డిని ఢీ కొట్టేందుకు రామచంద్రయాదవ్ ని ఉపయోగించుకుంటున్నారా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు.

పెద్దిరెడ్డి విషయంలో కేంద్రం యాక్షన్ కి దిగుతుందా అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీలోని వైసీపీ మీదనే అధారపడుతోంది. దాంతో వైసీపీ మంత్రి మీద చర్యలకు రెడీ అంటుందా ఒకవేళ అలా చేస్తే మాత్రం అది రాజకీయంగా పెను సంచలనం అవుతుంది అని అంటున్నారు.