Begin typing your search above and press return to search.

నూజివీడులో పార్ధసారధికి ఓడించే మాస్టర్ ప్లాన్ లో వైసీపీ...!

జగన్ నూజివీడు కి చెందిన ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కీలక నేతలను రప్పించారు. వారితో కీలక సమావేశం పెట్టి నూజివీడు రాజకీయాన్ని మార్చే పనిలో వైసీపీ ఉంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:30 AM GMT
నూజివీడులో పార్ధసారధికి ఓడించే మాస్టర్ ప్లాన్ లో వైసీపీ...!
X

తమ పార్టీ దాటారు, తమ గీత దాటారు అంటే ఏ పార్టీకైనా కోపంగానే ఉంటుంది. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన సీనియర్ నేత పార్ధసారధికి ఈసారి టికెట్ ఇవ్వలేమని వైసీపీ చెప్పేసింది. ఆయనను గన్నవరం లేదా మరో చోటకు షిఫ్త్ చేస్తామంది. అలా కాకపోతే మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తామని అంది. అయితే ఆయన పెనమలూరు కావాలని కోరారు అని ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయనకు హామీ ఇవ్వలేకపోయారు అని వైసీపీలో గుసగుసలు వినిపించాయి.

రాజకీయ నాయకుడిగా పార్ధసారధి తన పని తాను చేశారు. ఆయన చంద్రబాబుతో మంతనాలు జరిపారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న ఆ పార్టీలో చేరడానికి చూస్తున్నారు. ఆయనకు టీడీపీ కూడా పెనమలూరు సీటు ఇవ్వడంలేదు నూజివీడుకు షిఫ్ట్ చేసింది అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నోటి కాడ ముద్ద పోయింది అని ఆయనతో పాటు అనుచరులు గొల్లుమన్నారు.

ఇంకేముంది అటు నుంచి ఇటు అన్నట్లుగా వైసీపీలోకి ముద్దరబోయిన వచ్చేస్తున్నారు. ఇపుడు ఆయనకు నూజివీడు సీటు హామీ ఇస్తున్నారా అన్నది చర్చకు వస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు ప్లేస్ లో ముద్ద్రబోయినకు ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. జగన్ నూజివీడు కి చెందిన ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కీలక నేతలను రప్పించారు. వారితో కీలక సమావేశం పెట్టి నూజివీడు రాజకీయాన్ని మార్చే పనిలో వైసీపీ ఉంది.

మాజీ మంత్రి పార్ధసారధిని నూజివీడులో ఓడించాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ లో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావుకు టికెట్ ఇచ్చినా లేక ముద్దరబోయినకు ఇచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకుంటే బలం రెట్టింపు అవుతుందన్నది వైసీపీ ఆలోచన. ఒకటికి ఒకటి రెండు అవుతాయని లెక్క వేస్తోంది. నూజివీడు కి వలస వచ్చిన పారాచూట్ లీడర్ అని ఇప్పటికే ముద్దరబోయిన ఆరోపించారు.

దాంతో ఆయనను ఓడించడానికి ఈయన సహకరిస్తారు. ఇపుడు ఈయనకు ఎలాంటి పదవి ఇస్తే శాంతిస్తారు అన్నది వైసీపీ ముందు ఉన్న చర్చ. సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావుని పక్కన పెడితే ఆయన ఊరుకుంటారా అన్నది మరో చర్చగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం నూజివీడులో పార్ధసారధికి సుఖం లేకుండా చేసేందుకు గెలుపు ఆశలను గల్లంతు చేసేందుకు వైసీపీ తనదైన వ్యూహంతో ముందుకు వస్తోంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఎన్నికల్లో తెలుస్తుంది.