Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌ లో 33 మంది వైసీపీ నేతలు!

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 33 మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌ లో ఉన్నారని బాంబు పేల్చారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 2:27 PM GMT
కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌ లో 33 మంది వైసీపీ నేతలు!
X

వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ–జనసేన కూటమి తరఫున సీట్లు దక్కించుకోలేనివారందరికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం మంచి ఆప్షన్‌ లా కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. వీరి బాటలోనే వచ్చే ఎన్నికల్లో సీటు కోల్పోయిన మల్లాది విష్ణు కూడా చేరతారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 33 మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌ లో ఉన్నారని బాంబు పేల్చారు. జేసీ దివాకర్‌ రెడ్డి, మైసూరారెడ్డి సహా గతంలో కాంగ్రెస్‌ లో వున్నవారిని తాను కలిశానని తెలిపారు. ఈ క్రమంలో వివిధ పార్టీల్లో ఉన్న వారందరినీ కాంగ్రెస్‌ లోకి ఆహ్వానించానన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, తాను ఇద్దరం గతంలో యూత్‌ కాంగ్రెస్‌ లో పనిచేశామన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై చంద్రబాబుని అడగాలన్నారు. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ లోకి రావాలని ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నారని చింతా మోహన్‌ వెల్లడించారు. షర్మిల పార్టీలోకి రావాలని కోరుకుంది కాబట్టి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. షర్మిల పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె పదవి గురించి ఆలోచిస్తామని చెప్పారు.

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి పరిపాలన బాగుందని.. ఇందుకు ఆయనను అభినందిస్తున్నానన్నారు. రేవంత్‌ రెడ్డిని ఏపీ ఇంచార్జిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చింతా మోహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ని వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు.

కాగా చింతా మోహన్‌.. తిరుపతి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇందులో 1984, 1989, 1991ల్లో టీడీపీ తరఫున, 1998, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతలు వివిధ పార్టీల్లో చేరిపోయినా చింతా మోహన్‌ మాత్రం పార్టీని వీడలేదు. ఇటీవల కూడా మీడియాతో మాట్లాడిన చింతా మోహన్‌ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పోటీ టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్‌లో తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు.