Begin typing your search above and press return to search.

వైసీపీకి భారీ షాక్... విశాఖ కీలక నేత టీడీపీలోకి ?

వైసీపీకి తూర్పు ఆశలు ఈసారి అయినా తీరుతాయా అంటే కొత్త డౌట్ పెట్టేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 April 2024 4:08 AM GMT
వైసీపీకి భారీ షాక్...  విశాఖ  కీలక నేత టీడీపీలోకి ?
X

వైసీపీకి తూర్పు ఆశలు ఈసారి అయినా తీరుతాయా అంటే కొత్త డౌట్ పెట్టేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. 2019లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన అక్రమాని విజయనిర్మల టీడీపీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనలో ఉన్న బాబుకు టచ్ లోకి ఆమె కుటుంబం వెళ్లినట్లుగా చెబుతున్నారు.

ఆమె బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ఆమెకు వైసీపీ వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవిని కూడా ఇచ్చింది. అయితే విశాఖ తూర్పు నియోజకవర్గం సీటు మీద ఆశలు పెంచుకున్న విజయనిర్మల అసంతృప్తిగానే ఇన్నాళ్ళూ పార్టీలో ఉన్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి సిద్ధం సభ విశాఖ జిల్లా భీమిలీలో జరిగినా ఆమె హాజరు కాలేదు. తన ఇంటికి సమీపంలో సభ పెడితే ఆమె ఇంట్లో ఉండిపోవడంతో ఆనాడే డౌట్లు వచ్చాయి.

ఆ మీదట వైసీపీ హై కమాండ్ ఆమెను పిలిచి నచ్చచెప్పినా ఆమె మౌనంగానే ఉన్నారు. విశాఖ జిల్లాలో యాదవులకు తూర్పు తో పాటు గాజువాకలో బలం ఉంది. అలాగే భీమిలీలో ఉంది. ఈ మూడింటిలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అక్రమాని విజయనిర్మల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో వైపు చూస్తే ఎంవీవీ సత్యనారాయణకు తూర్పు సీటు ఇచ్చారు.

ఆయన ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీలు నూటికి ఎనభై శాతం ఉండే విశాఖ తూర్పులో ఓసీకి ఎలా సీటు ఇస్తారని వైసీపీలోని యాదవ సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆయననకు విశాఖ సౌత్ సీటు దక్కింది. ఇపుడు సరైన హామీ తీసుకుని అక్రమాని విజయనిర్మల టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు.

దీంతో విశాఖ తూర్పులో ఈ ప్రభావం గట్టిగా పడుతుందని అంటున్నారు. విశాఖ తూర్పులో ఇపుడు మేయర్ హరి వెంకట కుమారి మాత్రం బీసీ నేతగా యాదవ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మాత్రమే ఎంవీవీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అక్రమానిని కోరుతున్నారు. అయితే నిర్ణయం అన్నది తీసుకున్నారని సైకిలెక్కడమే తరువాయి అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే విశాఖ తూర్పు లో మరోసారి పసుపు జెండా ఎగరడానికి ఆమె రాక దోహదపడుతుందని అంటున్నారు. అదే విధంగా భీమిలీ గాజువాకల మీద ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు. దీనిని వైసీపీ ఎలా అధిగమిస్తుందో చూడాలని అంటున్నారు.