Begin typing your search above and press return to search.

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో టికెట్లు ఎవరికి? పక్కన పెట్టేదెవరిని?

తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల పరిధిలో అధికార వైసీపీకి చెందిన అభ్యర్థులు ఎవరన్నది ఇప్పుడు నరాలు తెగేంత ఉత్కంట నెలకొంది.

By:  Tupaki Desk   |   20 Dec 2023 10:30 AM GMT
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో టికెట్లు ఎవరికి? పక్కన పెట్టేదెవరిని?
X

ఏపీ అధికారపక్షంలో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేవలం పని తీరు ఆధారంగానే తప్పించి మరే ఆలోచనకు తావివ్వకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్లను కేటాయించే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న జగన్.. ఐప్యాక్ సూచనలకు తగ్గట్లే.. అభ్యర్థుల ఎంపికలోనూ తమ అభిప్రాయాల్ని చెప్పేస్తున్నారు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ కు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల పరిధిలో అధికార వైసీపీకి చెందిన అభ్యర్థులు ఎవరన్నది ఇప్పుడు నరాలు తెగేంత ఉత్కంట నెలకొంది. ఉమ్మడి క్రిష్ణా మీద ఫోకస్ చేసిన అధినేత జగన్.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సర్వే రిపోర్టుల ఆధారంగా కొందరికి స్థాన చలనం ఉంటే.. మరికొందరికి పోటీ చేసే అవకాశం ఉండదని.. కొత్త వారిని రంగంలోకి దించటం ఖాయమంటున్నారు. అతి త్వరలోనే ఉమ్మడి క్రిష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం జగన్.. ఆ సందర్భంగా వారికి మార్గదర్శనం చేస్తారని చెబుతున్నారు.

ఎలాంటి శషబిషలకు అవకాశం లేకుండా గెలుపు మాత్రమే ముఖ్యమన్న రీతిలో అధ్యక్షుడి అడుగులు సాగుతాయన్న మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిధిలోని రెండు లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో రెండింటిని మినహా మిగిలిన అన్ని స్థానాల్ని అధికార వైసీపీ సొంతం చేసుకుంది. అయితే.. విజయవాడ లోక్ సభ స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకున్నారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్.. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. కాకుంటే.. తర్వాత అధికార పార్టీ వైపు వెళ్లిపోవటం తెలిసిందే.

విజయవాడ సెంట్రల్ పరిధిలో గత ఎన్నికల్లో మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి సెంట్రల్ టికెట్ ను మార్చే వీలుందని చెబుతున్నారు. తిరువూర్ స్థానాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కొనేరు రంగారావుమనమరాలుతో పాటు మరికొందరు ప్రముఖులు ఆశిస్తున్నారు. కాకుంటే.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత వైసీపీ అభ్యర్థిని ఫైనల్ చేస్తారని చెబుతున్నారు. విజయవాడ ఎంపీ స్థానానికి వల్లభనేని వంశీ పేరును ఐప్యాక్ చెప్పగా.. ఆయన ఎంపీగా పోటీ చేయటానికి సిద్ధంగా లేనన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరిగా పోటీ చేయాల్సి వస్తే.. గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని తాను సూచన చేసిన వ్యక్తికే టికెట్ల ఇవ్వాలన్న షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఎంపిక వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు సంబంధించిన ముగ్గురు మాజీ మంత్రుల్లో కొడాలి నానికి సీటు గ్యారెంటీ అని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి పేర్ని నాని. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని స్వయంగా చెప్పారు. తనకు బదులుగా తన కుమారుడు కిట్టుకు టికెట్ ఇచ్చేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. టికెట్ ఎంపికలో సందేహాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. పేర్ని నానినే పోటీ చేయాల్సి ఉంటుందని.. లేదంటే వేరే వ్యక్తులను రంగంలోకి దించే వీలుందన్న మాట వినిపిస్తోంది.

విజయవాడ వెస్టు విషయానికి వస్తే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు టికెట్ కేటాయింపులో సందేహాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు బదులుగా ఒక మైనార్టీ నేతను బరిలోకి దించే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. వెల్లంపల్లి ఇక్కడో సూచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే.. తాను చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ పోటీ అంశం సందేహంగా మారింది. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన్ను పెడన నుంచి స్థానచలనం ఖాయమని..ఆయన్ను ఎంపీగా పోటీ చేయించే వీలుందంటున్నారు. బీసీ వర్గానికి చెందిన నేత కావటంతో ఆయన్ను అవసరమైతే ఏలూరు లేదంటే మచిలీపట్నంనుంచి పోటీ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.