Begin typing your search above and press return to search.

ఆపరేషన్ కోస్తా : వైసీపీ భారీ యాక్షన్ ప్లాన్ రెడీ ..!

వైసీపీ పూర్తిగా కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టింది. కోస్తా జిల్లాలు అంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రా జిల్లాలు అన్న మాట

By:  Tupaki Desk   |   9 April 2024 3:58 AM GMT
ఆపరేషన్ కోస్తా : వైసీపీ భారీ యాక్షన్ ప్లాన్ రెడీ ..!
X

వైసీపీ పూర్తిగా కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టింది. కోస్తా జిల్లాలు అంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రా జిల్లాలు అన్న మాట. ఇవి ఏడు జిల్లాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అసెంబ్లీ సీట్లు 101 ఉన్నాయి.

ఇందులో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్నది ఏకంగా 84 సీట్లు. అంటే అప్పట్లో వైసీపీ సునామీ అలా బలంగా వీచింది అని చెప్పాలి. ఆ దెబ్బకు టీడీపీకి కంచుకోటలుగా చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాలు అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలు సైతం ఫ్యాన్ నీడకు చేరాయి.

ఉమ్మడి క్రిష్ణా గుంటూరు జిల్లాలలో మొత్తం 33 సీట్లు ఉంటే అందులో 29 సీట్లు వైసీపీకి దక్కాయి. ఉభయ గోదావరి జిల్లాలలో 34 సీట్లు ఉంటే 27 సీట్లు అలాగే ఉత్తరాంధ్రాలో 34 సీట్లు ఉంటే 28 సీట్లు వైసీపీ గెలుచుకుని బలంగా సత్తా చాటింది.

అంటే మొత్తం 101 సీటకు 84 సీట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అలా టీడీపీ కూసాలు అన్నీ కదిలించివేసింది వైసీపీ ఫ్యాన్. కానీ ఇపుడు చూస్తే సీన్ కాస్తా మారింది, క్రిష్ణా గుంటూరు జిల్లలలో మూడు రాజధానులతో వ్యతిరేక ప్రభావం పడుతుందని భావిస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన టీడీపీ పొత్తు ప్రభావం ఉండొచ్చు అని అంచనా కడుతోంది. ఉత్తరాంధ్రాలో మునుపటి కంటే టీడీపీ పుంజుకుంది అని లెక్కలేస్తోంది.

దాంతో ఈసారి కోస్తా జిల్లాలలో గతంలో వచ్చిన 84 సీట్లలో తిరిగి ఎన్ని దక్కుతాయన్నది వైసీపీలో అంతర్మధనం సాగుతోంది. ఇందులో కనీసం యాభై నుంచి అరవై సీట్లు గెలుచుకుంటే మరోసారి అధికారం సొంతం అవుతుంది అని భావిస్తోంది. దానికోసం ఆపరేషన్ కోస్తా అని వైసీపీ యాక్షన్ ప్లాన్ కి దిగిపోతోంది.

అదెలా అంటే జనసేన టీడీపీ బీజేపీల పొత్తులలో సీట్లు దక్కక అసంతృప్తికి లోను అయిన వారు అలాగే సీట్ల కోసం చాలా కాలంగా ఆశలు పెట్టుకుని దక్కని వారు ఇలా చాలా మంది ఉన్నారు. సుమారుగా వందకు యాభై నియోజకవర్గాలలో చూస్తే కూటమిలో అసంతృప్తులు ఈ కోస్తా జిల్లాలలో ఉన్నాయని వైసీపీ అంచనా కడుతోంది.

దాంతో వీరిలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకుంటే పొత్తు ఎత్తులు చిత్తు చేయడంతో పాటు 2019 నాటి బలాన్ని తాము తిరిగి పోందేందుకు వీలు కలుగుతుందని కూడా భావిస్తోంది. దాంతో ఆపరేషన్ మొదలెట్టింది అని అంటున్నారు.

మరి వైసీపీ ఆపరేషన్ లో బిగ్ షాట్స్ చాలా మంది ఉన్నారని అంటున్నారు. అందులో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎంపీలు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే జనసేనలో కూడా సీనియర్ నేతలు పార్టీ కోసం పనిచేస్తూ తమ గొంతు బలంగా చాటుకుంటున్న వారు ఉన్నారని అంటున్నారు.

వారిని వైసీపీ వైపు ఆకర్షిస్తే కోస్తాలో ఫ్యాన్ మరోమారు గిర్రున తిరుగుతుందని ఊహిస్తున్నారు. అయితే వైసీపీ ఆపరేషన్ కోస్తాకు టీడీపీ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు అంటున్నారు. అదే టైం లో జనసేన నుంచి బాగానే రెస్పాన్స్ వస్తోంది. దాంతో గోదావరి క్రిష్ణా జిల్లాలలో పలు సీనియర్ నేతలు చేరుతున్నారు అని అంటున్నారు.

ఇక్కడ వైసీపీ ఒక డెడ్ లైన్ పెట్టుకుంది అని అంటున్నారు. ఈ నెల 18న నోటిఫికేషన్ వస్తోంది. అప్పటికి కోస్తా ఆపరేషన్ ని పూర్తి చేయలన్నది ఆ పార్టీ ప్లాన్ గా ఉంది. జనసేన నుంచి చేరికలు బాగానే ఉన్నా టీడీపీ బిగ్ షాట్స్ విషయంలోనే ఇంకా ఏమీ తేలడంలేదు అంటున్నారు.

అయితే జగన్ కోస్తా టూర్ కి వచ్చేలోగా కొంతమంది టీడీపీ నేతలు అయినా వైసీపీ వైపు వచ్చేందుకు రెడీ అంటారు అని అంచనా కడుతున్నారు. అదే జరిగితే టీడీపీ పొత్తులతో వచ్చినా కూటమి కట్టినా దాని ఫలితాలు అయితే పెద్దగా ఉండవని వైసీపీ వ్యూహకర్తలు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. వైసీపీ ఆలోచనల మేరకు ఎవరు ఆ పార్టీ వైపు వస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.