Begin typing your search above and press return to search.

కర్నూల్ వైసీపీలో కొత్త కుదుపు...టికెట్ ఎవరికి...?

వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా కర్నూల్ ని చెబుతారు

By:  Tupaki Desk   |   17 July 2023 11:51 AM GMT
కర్నూల్ వైసీపీలో కొత్త కుదుపు...టికెట్ ఎవరికి...?
X

వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా కర్నూల్ ని చెబుతారు. 2014లో మెజారిటీ సీట్లను గెలుచుకున్న వైసీపీ 2019లో మొత్తానికి మొత్తం స్వీప్ చేసి పారేసింది. ఈ నేఅధ్యంలో 2024 ఎన్నికల కోసం వైసీపీ అపుడే కసరత్తు మొదలెట్టింది. పార్టీని పటిష్టం చేసుకునే నేపధ్యంలో కొత్త నేతలను చేర్చుకుంటోంది. ఇక కర్నూల్ జిల్లాలో పేరుపడిన ముస్లిం మైనారిటీ నాయకుడిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించింది.

ఆయన అహ్మద్ ఆలీ ఖాన్ అనే సీనియర్ రాజకీయ నేత. ఆయన 2014 లో కర్నూల్ ఎమ్మెల్యేగా, 2019లో కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్ కి డీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేసి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల వేళ ఆయన అధికార వైసీపీలో చేరడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఆయన్ని పార్టీలోకి చేర్పించడంలో కడపకు చెందిన ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కీలకమైన పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే అహ్మద్ ఆలీ ఖాన్ వైసీపీలో చేరారని అంటున్నారు. మరి ఆయనకు ఎంపీ ఇస్తారా లేక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ ని అహ్మద్ ఆలీ ఖాన్ కోరుకుంటున్నారు అని అంటున్నారు.

అయితే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఆయన మీద సొంత పార్టీలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. మరో వైపు 2014లో కర్నూల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఆ పార్టీ టికెట్ ని ఆశిస్తున్నారు. ఎస్వీ అంటే భూమా నాగిరెడ్డి సొంత బావమరిది. మాజీ మంత్రి, సీనియర్ నేత ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడు, రాజకీయ వారసుడు అయిన ఎస్వీ తన రాజకీయ అదృష్టాని మరోమారు పరీక్షించుకునేందుకు వైసీపీ నుంచి గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు అహ్మద్ ఆలీ ఖాన్ వైసీపీలోకి రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు ఎస్వీ మోహన్ రెడ్డికి కూడా టికెట్ చిక్కులు ఏర్పడ్డాయని అంటున్నారు. ఎటూ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న వారిని మారుస్తామని వైసీపీ అంటోంది. అలా హఫీజ్ ఖాన్ కి టికెట్ ఇవ్వకపోతే తనకే ఖాయం అని భావిస్తున్న మోహన్ రెడ్డికి ఈ పరిణామం షాకింగ్ అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కర్నూల్ ఎంపీ టికెట్ అయినా అహ్మద్ ఆలీ ఖాన్ కి ఇవ్వవచ్చు అని అంటున్నారు. అలా కనుక చేస్తే ఎస్వీ మోహన్ రెడ్డికి చాన్స్ ఉంటుంది, మైనారిటీని పక్కన పెట్టి రెడ్డికి టికెట్ ఇచ్చారన్న విమర్శలు ఉండవని పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇక కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారని పార్టీ ఆయనకు టికెట్ ఈసారి ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే అహ్మద్ ఆలీ ఖాన్ చేరికతో కర్నూల్ లో వైసీపీ బలపడుతోందని పార్టీ నేతలు చెబుతూంటే ఆశావహులకు మాత్రం కలవరం రేగుతోంది అని అంటున్నారు.