Begin typing your search above and press return to search.

వైసీపీ కప్పులో గాజువాక తుఫాన్... దేవన్ రెడ్డి రాజీనామా పుకారే!

దీంతో ఒకే రోజు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న రెండు సీట్లలో రాజీనామాల పర్వం కలకలం రేపింది. వైసీపీలో ఏమి జరుగుతుంది అనే చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 8:01 AM GMT
వైసీపీ కప్పులో గాజువాక తుఫాన్... దేవన్  రెడ్డి రాజీనామా పుకారే!
X

సోమవారం ఒక్కరోజు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేవలం తన వ్యక్తిగత కారణాలతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్కే తన లేఖలో ప్రస్థావించారు. తనకు రెండు సార్లు టిక్కెట్ ఇచ్చిన వైఎస్ జగన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో గాజువాకలో కూడా సేం సీన్ రిపీట్ అయ్యిందనే వార్తలు హల్ చల్ చేసిన నేపథ్యంలో తాజాగా వాటిపై క్లారిటీ వచ్చింది.

అవును... ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం, గెలుపే లక్ష్యం అన్నట్లుగా సాగే క్రమంలో ఈ మాత్రం మార్పులు చేర్పులు అనివార్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనంతరం విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి

దీంతో ఒకే రోజు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న రెండు సీట్లలో రాజీనామాల పర్వం కలకలం రేపింది. వైసీపీలో ఏమి జరుగుతుంది అనే చర్చ మొదలైంది. ఈ సమయంలో మంగళగిరికి స్థానిక కీలక నేత, బీసీ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్ ఛార్జ్ గా ప్రకటిస్తూ జగన్ చక చకా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో గాజువాక వ్యవహారంపై ఉత్తరాంధ్ర వ్యవహారాల వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో తాజాగా తిప్పల దేవన్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ మేరకు ఈ రోజు ఉదయం వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.. ఆయన కుమారుడు, గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన రాజినామా వ్యవహారం సృష్టించిన కలకలంపై చర్చించారని తెలుస్తుంది. వీరి భేటీ అనంతరం బయటకు వచ్చిన దేవన్ రెడ్డి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తన రాజీనామా వ్యవహారం అంతా పుకారే అన్నట్లుగా కొట్టిపారేశారు!

ఈ తాజా వ్యవహారంపై స్పందించిన గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ... తాను గాని, తన కుమారులు కానీ ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులుగా.. పార్టీకి విధేయులుగా ఉంటామని ప్రకటించారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కంకణబద్ధులై ఉంటామని అన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, తమకు అదే ముఖ్యం అని తెలిపారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనంతరం దేవన్ రెడ్డి స్పందించారు. సోమవారం నాడు తాను వ్యక్తిగత పనుల మీద బయటకి వెళ్ళానని, వెళ్లేముందు ఇంచార్జి సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్లినట్లు తెలిపారు. అయితే తాను వెళ్లిన చోట ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో.. తాను తిరిగి వచ్చేసరికి తనపై ఇలాంటి పుకార్లు లేపారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను పార్టీతోనే వున్నానని సుబ్బారెడ్డికి వివరణ ఇచ్చేందుకే తండ్రితో కలిసి వచ్చానట్లు ప్రకటించారు.

దీంతో నిన్నటి రోజున వైసీపీలో.. ప్రధానంగా విశాఖ వైసీపీలో హాట్ టాపిక్ గా మాట్లాడిన దేవన్ రెడ్డి వ్యవహారం "వైసీపీ కప్పులో గాజువాక తుఫాను" గా ప్రశాంతంగా ముగిసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.