వట్టిపోయిన వైసీపీ విప్...అంతా గప్ చుప్
విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తమ పార్టీ బీ ఫారం మీద గెలిచిన మొత్తం 58 మంది కార్పోరేటర్లకు విప్ ని జారీ చేసింది.
By: Tupaki Desk | 19 April 2025 4:21 PM ISTవిశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తమ పార్టీ బీ ఫారం మీద గెలిచిన మొత్తం 58 మంది కార్పోరేటర్లకు విప్ ని జారీ చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించవద్దు అని కూడా హెచ్చరించింది. ఐతే ఏకంగా 27 మంది కార్పోరేటర్లు విప్ ని ధిక్కరించి కూటమికి అనుకూలంగా ఓటు వేశారు.
దాంతో వైసీపీ విప్ అస్త్రం పని చేయకుండా పోయింది. దాంతో వైసీపీ ఏమి చేస్తుంది అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే తమ పార్టీ విప్ జారీ చేసి అవిశ్వాస తీర్మానానికి రెండు రోజుల ముందే ఎన్నికల రిటర్న్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది అని విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాధ్ చెప్పారు.
ఇక వైసీపీ విప్ ని ధిక్కరించి కూటమిని అనుకూలంగా ఓటు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ విప్ అయిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ కలెక్టర్ ని కలసి మొత్తం లిస్ట్ ని అందించారు. అయితే దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని గుడివాడ అంటున్నారు. లేకపోతే న్యాయ పోరాటం చేపడతామని చెప్పారు.
నిజానికి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీకి ఓటు చేస్తే కచ్చితంగా వారి సభ్యత్వం రద్దు అవుతుంది. కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులు. మరి అది ఇపుడు సాధ్యపడుతుందా అన్నదే చర్చగా ఉంది. వారు ఈ ప్రాసెస్ ని డిలే చేసేందుకే ఆస్కరం ఉంది. ఎటూ మరో పది నెలలలో ఈ కార్పోరేటర్ల పదవీ కాలం పూర్తి అవుతుంది.
మరి వైసీపీ పట్టుదలగా వీరి విషయంలో ఉంటే కనుక కచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. మరి కోర్టు ముందుకు ఈ అంశం వస్తే కనుక వారిని అనర్హులుగా ప్రకటించమని చెబుతుందా చెబితే అపుడు అధికారులు ఏమి చేస్తారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా తక్కువ సమయమే వీరి పదవీ కాలం ఉంది. అందుకే చాలా మంది డేరింగ్ గా ఓటు వేశారు.
వైసీపీ విప్ అన్నది ఇపుడు పదునైన అస్త్రంగా కాకుండా అలా మిగిలిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే రానున్న రోజులలో కూటమిలో వైసీపీ కార్పోరేటర్లకు ఏ మాత్రం విలువ గౌరవం ఉంటాయన్న దానిని కూడా చూడాలని అంటున్నారు అక్కడ లోకల్ గా ప్రతీ వార్డులో ఈ కార్పోరేటర్లకు ఆయా పార్టీల నుంచి ప్రత్యర్ధులు ఉన్నారు. వారితో కలసి లోకల్ పాలిటిక్స్ చేయడం కష్టం అవుతుంది.
సహజంగా కార్పోరేటర్ కాబట్టి ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అలా కనుక చేస్తే వారి మీద ఓడిన వారు గుస్సా అవుతారు. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకు ఆయా పార్టీలు ఇస్తేనే తాము ఓటు వేస్తామని కొందరు ఒప్పందం పెట్టుకుని వచ్చారు. మరి వారి సంగతి ఏమిటి అన్న చర్చ ఉంది.
ఏది ఏమైనా వైసీపీ మేయర్ ని దించేయడం అన్న ఒక లక్ష్యం కోసం అంతా కలిశారు. ఆ తరువాత ఎవరేమిటి అన్నది అప్పటి రాజకీయం నిర్ణయిస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీని వీడి వెళ్ళిన వారిని మళ్ళీ తీసుకోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో ఈ టెర్మ్ తరువాత చాలా మందికి రాజకీయం అన్నది పరిసమాప్తం అవుతుంది అని అంటున్నారు. బహుశా అలా జరిగితే అదే అసలైన శిక్షగా ఉంటుంది తప్ప ఈ విప్ ధిక్కరణ వల్ల వారి మీద ఇప్పటికిపుడు చట్టపరమైన చర్యలు ఏమీ ఉండబోవని విశ్లేషకులు అంటున్నారు.
