వైసీపీకి ట్వీట్లూ మీడియా మీట్లతోనే సరిపోతుందా ?
By: Tupaki Desk | 16 Sept 2025 8:30 AM ISTఏపీలో వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది. ఇది ప్రజలను ముమ్మాటికీ దెబ్బ తీయడమే అంటోంది. దీని మీద వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడేపల్లిలో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సోదహరణంగా వివరించే ప్రయత్నం చేశారు. అంతే కాదు ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నారు ఇక గొంతు కలపమని ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు చేరువ చేయమని పార్టీ నేతలకు పురమాయించారు.
పులివెందులలోనే లేటుగా :
అయితే వైసీపీ నేతలు మాత్రం ఆలస్యంగానే మేలుకుంటున్నారు. పులివెందులలో వైద్య కళాశాల భవనాలను చూసేందుకే వారికి ఆలస్యం అయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ విషయంలో పార్టీ నేతలు ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు నిర్వహించి జనంలో కూటమి చేస్తున్న పీపీపీ విధానాన్ని ఎండగట్టాలని అధినాయకత్వం కోరుతోంది. అయితే దానికి అతి తక్కువ స్థాయిలోనే స్పందన కనిపిస్తోంది.
జగన్ వరస ట్వీట్లు :
ఇదిలా ఉంటే ఇప్పటికి రెండేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున సెప్టెంబర్ 15న ఏపీలో అయిదు మెడికల్ కాలేజీలను తాను స్వయంగా ప్రారంభించినట్లుగా జగన్ ట్వీట్ చేశారు. మరి కొన్ని నిర్మాణ దశలో ఉండగానే తమ ప్రభుత్వం దిగిపోయింది అన్నారు. అంతకు ముందు ఏపీలో 12 మాత్రమే వైద్య కళాశాలలు ఉంటే తన హయాంలో 17ని కొత్తగా తీసుకుని వచ్చామని ఆయన చెబుతున్నారు. కూటమి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన అంటున్నారు.
రాజకీయం అంటున్న కూటమి :
అయితే ఇదంతా రాజకీయం కోసం చేస్తున్న విమర్శలుగా కూటమి మంత్రులు పెద్దలు కొట్టి పారేస్తున్నారు. జగన్ హయాంలో ఎందుకు పూర్తిగా కట్టలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటు అని ఎవరు చెప్పారని కూడా నిలదీస్తున్నారు. నిరహణ ప్రైవేట్ వారి చేతిలో ఉన్నా వారి మీద ఆధిపత్యం ప్రభుత్వం చేతిలో ఉంటుందని అంటున్నారు. ఇక గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే తాము ప్రయత్నం చేశామని చెబుతున్నారు.
జనంలోకి వెళ్తామని :
అయితే వారం క్రితం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశం మీద తాము ప్రజలలోకి వెళ్ళి అడ్డుకుంటామని జగన్ చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి ఉద్యమిస్తామని కూడా అన్నారు. తాను కూడా అనేక చోట్ల జరిగే ఆందోళనలలో స్వయంగా పాల్గొంటాను అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఆ దిశగా ఏమీ జరగడం లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రభుత్వం వైపు నుంచి బలమైన వాదనలు వినిపిస్తూంటే వైసీపీ వాయిస్ ని వినిపించాల్సిన వారు తక్కువగానే ఉన్నారని అంటున్నారు.
ఇద్దరు మంత్రులు వైసీపీ హయాంలో వైద్య శాఖను చూశారు. అందులో ఒక మాజీ మంత్రి ఆళ్ళ నాని టీడీపీలో చేరిపోయారు. మరో మాజీ మంత్రి విడదల రజని అయితే గట్టిగా జోరు చేయాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఈ ఇష్యూని ఎంతో సీరియస్ గా తీసుకుందని మొదట్లో అనిపించినా పోరాటానికి అవసరమైన కసరత్తు ఇంకా పూర్తి కాలేదా లేక ట్వీట్లూ మీడియా మీట్లతోనే సరిపోతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
