Begin typing your search above and press return to search.

కూటమి ఒట్టేసి చెబుతోంది...జగన్ అతి ఆపాల్సిందేనా ?

షెడ్యూల్ ప్రకారం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నాలుగేళ్ళ సమయం బిగిసి ఉంది. అయినా వైసీపీ అధినేత జగన్ మాత్రం మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   20 July 2025 7:00 AM IST
కూటమి ఒట్టేసి చెబుతోంది...జగన్ అతి ఆపాల్సిందేనా ?
X

షెడ్యూల్ ప్రకారం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నాలుగేళ్ళ సమయం బిగిసి ఉంది. అయినా వైసీపీ అధినేత జగన్ మాత్రం మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. అంతే కాదు ఈసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని కూడా బల్ల గుద్ది చెబుతున్నారు. అయితే వైసీపీ అధినేత ఏ విధమైన అంచనాలతో చెబుతున్నారో కానీ కూటమి పెద్దలు మాత్రమే మళ్ళీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు.

ఒకరు కాదు మూడు పార్టీలూ అదే మాట అంటున్నాయి. ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది అన్నది తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి నలభై నుంచి నలభై అయిదు శాతం ఓటు షేర్ ఉంది. జనసేనకు ఏడెనిమిది శాతం ఓటు షేర్ సొంతంగా ఉంది. ఒకటి నుంచి రెండు శాతం బీజేపీకి ఉంది. ఎలా చూసుకున్నా ఈ మూడు పార్టీలు కలిస్తే 55 శాతం ఓటు షేర్ కూటమి సొంతం చేసుకోవడం అని అంటున్నారు. ఒక వేళ అయిదేళ్ళ పాలన మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అనుకున్నా ఒక అయిదు శాతం తీసేసినా యాభై శాతం నికరంగా కూటమికి ఓటు షేర్ గా దక్కుతుంది అని అంటున్నారు.

ఇక బీజేపీకి మోడీ ఇమేజ్ గ్లామర్ గా ఉంటే టీడీపీకి చంద్రబాబు అతి పెద్ద గ్లామర్ గా ఉన్నారు. ఇక జనసేనకు పవన్ కళ్యాణ్ గ్లామర్ వేరే లెవెల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురూ త్రిమూర్తుల మాదిరిగా కూటమికి అతి పెద్ద బలంగా బలగంగా ఉంటారు. దీంతో కూటమికి బీటలు వారుతాయన్న ఆశలు అయితే వైసీపీ పెట్టుకోవాల్సినది లేదని అంటున్నారు.

మేమంతా కలసే పోటీ చేస్తాం, 2029లోనూ మళ్ళీ మేమే గెలుస్తామని చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే వైసీపీని ఏపీలో మళ్ళీ అధికారంలోకి రానీయమని స్పష్టంగానే చెబుతున్నారు. ఆయన ఇంకా ముందుకెళ్ళి పదిహేనేళ్ళ పాటు చంద్రబాబు సీఎం గా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని కూడా చెబుతున్నారు. లేటెస్ట్ గా చూస్తే బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత అయిన సోము వీర్రాజు 2029లో అధికారం కూటమినే అని జోస్యం చెప్పారు. వైసీపీ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రాదు అన్నారు.

దాంతో బీజేపీ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది అని అంటున్నారు. జగన్ విషయం చూస్తే కూటమి వైఫల్యాలను ఆయన నమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అంటున్నారు. అందుకే మేమే అధికారంలోకి వస్తామని ధీమా కనబరుస్తున్నారు. కానీ కూటమిగా అంతా ఒక్కటిగా వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అధికారంలో ఉంటూ పోటీ చేస్తే అపుడు తట్టుకోవడం వైసీపీకి కష్టమవుతుందని అంటున్నారు. ఇక విపక్షాలు చూస్తే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని తెలుస్తోంది. వామపక్షాలు కాంగ్రెస్ లకు కనీసంగా ఒకటి నుంచి రెండు శాతం ఓటు షేర్ ఉంటుంది. వారిని కలుపుకోకుండా వైసీపీ బరిలోకి దిగితే ఇంకా ఇబ్బందే అని అంటున్నారు.

అందువల్ల మళ్ళీ మేమే అన్న అతి ధీమాను వదిలేసి ప్రాక్టికల్ గా జగన్ ఆలోచించాలని అంటున్నారు. కూటమి అయితే విడిపోదు అన్నది కన్ ఫర్మ్ అంటున్నారు. వైసీపీకి ఉన్న 40 శాతం ఓటు షేర్ ని ఎలా 51 శాతం చేయాలన్న దాని మీదనే దృష్టి సారించాలని అంటున్నారు. అంటే మరో 11 శాతం కొత్తగా ఓటు షేర్ అన్న మాట. ఆ ఓటు షేర్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే కూటమి నుంచే రావాలి. ఇంత పెద్ద ఎత్తున ఓటు షేర్ ఆ వైపు నుంచి ఈ వైపునకు టర్న్ కావాలంటే వైసీపీ టోటల్ ఆలోచనా విధానమే మారాల్సి ఉంటుంది.

అంతే కాదు వ్యూహాలు కూడా పదును తేరి ఉండాలి అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2029 లో గెలవడం అన్నది అంత ఈజీ కాదు అని ఏపీ రాజకీయ చిత్రం తెలియచేస్తోంది అన్నది ఒక విశ్లేషణ. ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుని జాగ్రత్తగా వైసీపీ అడుగులు వేయడమే కాకుండా ఏపీలో విపక్ష కూటమిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతీ ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఒడిసి పట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.