Begin typing your search above and press return to search.

పెద్దలకో దండం...వైసీపీలో ఏం జరుగుతోంది ?

వైసీపీలో పెద్దలు అయిన వారిని సైడ్ చేస్తున్నారా లేక వారే పక్కకు పోతున్నారా అన్నది తెలియడం లేదు.

By:  Tupaki Desk   |   15 April 2025 1:00 PM IST
YCP Seniors Absent from Key Political Advisory Committee
X

వైసీపీలో పెద్దలు అయిన వారిని సైడ్ చేస్తున్నారా లేక వారే పక్కకు పోతున్నారా అన్నది తెలియడం లేదు. చాలా మంది సీనియర్లు పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు అంతా ఇపుడు ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది జగన్ తో పాటు వైసీపీ అన్న కొత్త పార్టీ పురుడు పోసుకోవడానికి ఎంతో చేశారు. అయితే వారంతా ఇపుడు ఎక్కడ ఉన్నారు అన్నదే చర్చగా ఉంది.

జగన్ తో పాటు కాంగ్రెస్ ని వదిలేసి బయటకు వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇపుడు జనసేనలో ఉన్నారు. మోపిదేవి వెంకట రమణ టీడీపీలో చేరిపోయారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి పెద్ద దండం పెట్టేశారు.

ఇలా చూస్తే కనుక ఆది నుంచి పార్టీలో ఉన్న వారు అనేక మంది ఇపుడు లేరు. ఇక వైసీపీలో ఉన్న వారి పరిస్థితి చూస్తే వారు సైలెంట్ అయ్యారా అన్న చర్చ సాగుతోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన వారు. పూర్తి స్థాయిలో బలం ఉన్న వారు.

ఆయన ఇపుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. తాజాగా వైసీపీ అధినాయకత్వం 33 మందితో రిలీజ్ చేసిన పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీలో సీనియర్లు చాలా మంది కనిపించలేదు అని అంటున్నారు. అందులో పార్టీలో జగన్ కి కుడిభుజంగా ఉంటూ ఆనాటి యూపీఏ సర్కార్ ని ఎదిరించి తమ ఎంపీ పదవిని వదులుకున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు పీఏసీలో లేదు. ఆయన కూడా జగన్ తో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చిన వారు.

ఎందుకిలా అంటే ఏమో అనే జవాబు వస్తోంది. తమ పెద్ద కుమారుడు గౌతం రెడ్డి మరణించాక ఆయనలో విరక్తి కలిగింది అని అందుకే ఆయనే పదవి వద్దు అనుకున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చూస్తే ఆయన నెల్లూరు రాజకీయాల మీద కూడా ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు. మరో కుమారుడు మేకపాటి విక్రాంత్ రెడ్డి అన్న గౌతం లా లేక తండ్రి రాజమోహన్ రెడ్డిలా అంత చురుకుదనంతో ముందుకు సాగడంలేదు అని అంటున్నారు.

ఇక మరో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు అని అంటున్నారు. ఆయనను కూడా పీఏసీలో తీసుకోలేదు. ఆయన కూడా టీడీపీలో కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన గతంలో పీఏసీ మెంబర్ గా ఉన్నారు. కానీ ఇపుడు ఆయన పేరు జాబితాలో లేదు. దాంతో ఆయన వయోభారంతో సైడ్ అయ్యారా లేక సైడ్ చేశారా అన్న చర్చ సాగుతోంది.

అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ నేత అయిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు పీఏసీ లిస్ట్ లో లేకపోవడం కూడా అందరినీ విస్మయ పరుస్తోంది. ఆయనకు ఎందుకు ఈ పదవి ఇవ్వలేదు అని కూడా చర్చించుకుంటున్నారు. ధర్మాన పార్టీలో ఉన్నారా లేక లేరు అని అధినాయకత్వం ఫిక్స్ అయి ఆయనను పక్కన పెట్టేసిందా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.

ధర్మాన వంటి వారు పార్టీకి బలంగా ఉంటారు, ఆయన తనదైన మేధస్సుతో అనుభవంతో పార్టీకి మంచి సలహాలు ఇస్తారని అంటున్నారు. మరి ఆయనను ఎందుకు పక్కన పెట్టారు అన్నది కూడా అంతా ప్రశ్నించుకుంటున్నారు. వీరే కాదు ఇంకా చాలా మంది సీనియర్ నేతలు వైసీపీలో కనిపించడం లేదు ఎందుకు అన్న చర్చ సాగుతోంది.

వైసీపీ పెద్దలకు ఒక దండం అనేసిందా లేక వారే వైసీపీలో ఇమడలేకపోతున్నారా అన్నది కూడా హాట్ డిస్కషన్ గా ఉంది. ఏది ఏమైనా వైసీపీలో కొత్తగా వేసిన పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో సలహాలు ఇచ్చేవారు ఎవరు తీసుకునేది ఎవరు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ కొత్త మెంబర్స్ ఏ విధంగా ముందుకు సాగుతారో.