వైసీపీ పునర్ నిర్మాణం....మళ్ళీ ప్రయాణం
వైసీపీ ఓడిపోయి పద నాలుగు నెలలు అయింది. 151 సీట్లతో అందలం ఎక్కిన ఒక పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం అంటే అది షాకులకే పెద్ద షాక్.
By: Tupaki Desk | 25 July 2025 10:43 AM ISTవైసీపీ ఓడిపోయి పద నాలుగు నెలలు అయింది. 151 సీట్లతో అందలం ఎక్కిన ఒక పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం అంటే అది షాకులకే పెద్ద షాక్. అందుకే వైసీపీ ఈ షాక్ నుంచి ఏ మాత్రం తట్టుకోలేకపోతోంది, ఇంకా చెప్పాలీ అంటే అసలు తేరుకోలేకపోతోంది. చిత్రమేంటి అంటే ఎందుకు ఓటమి చెందామన్నది మూలల నుంచి వైసీపీలో పరిశోధన కానీ ఆత్మ విమర్శ కానీ జరిగిందా అన్నది. ఈ మాట ఎందుకు అంటే ఓటమిని షాక్ అంటున్నారు. షాక్ లాంటి రిజల్ట్ వచ్చిందంటే ఏమి జరిగిందో ఆలోచించాలి కదా అన్నది విశ్లేషకుల మాట.
ఎంతో మంచి చేసి ఓడిపోయామని కూడా మధనపడుతున్నారు. మంచి చేస్తే ఓటమి ఒకవేళ ఎదురైనా ఇంతటి భారీ ఓటమి అయితే దక్కదు కదా అన్నది ఒక విశ్లేషణ. కానీ దాని గురించి కాకుండా మేము ఓడిపోయాం, మంచి చేశామని వైసీపీ ఇంకా అలాగే ఆలోచిస్తూ అక్కడే ఉందా అంటే ఆ పార్టీ కీలక నేత రాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేటర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు.
మేము ఓడాం, షాక్ తిన్నాం, ఎంతో మంచి చేసినా ఈ ఓటమి సంభవించింది అని ఒక ఇంటర్వ్యూలో సజ్జల వ్యాఖ్యానించారు. అయితే ఈ ఓటమి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి పుంజుకుంటున్నామని ఆయన చెప్పారు. మేము మళ్ళీ జోరెత్తుతామని కూడా ధీమా వ్యక్తం చేశారు. ధీమా ఉండడం కూడా ఒక వ్యవస్థ కు అయినా వ్యక్తికి అయినా మంచిదే. అదే ఆయన వ్యక్తం చేశారు.
జగన్ రోజుకు రెండు వందల మంది దాకా కార్యకర్తలను కలుస్తున్నారు అని సజ్జల మరో మాట చెప్పారు. వారి నుంచి బహుశా ఫీడ్ బ్యాక్ ఏమైనా తీసుకుంటున్నారేమో అనుకోవాలి. ఇది మంచి పరిణామంగానే భావించాలి కూడా. క్యాడర్ అంటే నడిచే పార్టీగా చూడాలి. పార్టీకి వారే ప్రాణ వాయువు, వారే రక్తం అని కూడా భావించాలి.
అలాంటి క్యాడర్ తో ఎంత దగ్గరగా ఉంటే ఎంతలా మమేకం అయితే ఫలితాలు అంత బాగా వస్తాయని రాజకీయ చరిత్ర నిరూపించింది. సో వైసీపీ ఈ రూట్ కరెక్ట్ గానే ఉంది. మరో వైపు చూస్తే సజ్జల ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. అరాచక పాలన అన్నారు. అంటే కూటమి ప్రజలకు ఏ మేలు చేయలేదని భావంతోనే అన్నారనుకోవాలి. లేదా తమ పార్టీ నాయకులను వరసబెట్టి జైలులో పెడుతోంది కాబట్టి కూడా అని భావించాలి.
ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి పోరాడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయాల్సింది అదే. అందుకే సజ్జల కూడా విపక్షంగా వైసీపీ మరింత దూకుడుని రానున్న కాలంలో చూపిస్తుందని అన్నారు. అదే విధంగా ఆయన ఇంకో మాట చెప్పారు. పార్టీని పునర్ నిర్మిస్తున్నామని. అది కూడా అవసరమే. పార్టీ అన్నాక అది నిరంతర ప్రవాహం లాంటిది. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినా సరిచేసుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా చేస్తేన పార్టీ ఒక జీవనదిగా దూకుడుగా ముందుకు సాగుతుంది.
అంతే కాదు కమిటీలు వేస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలతో పార్టీకి కొత్త రూపూ షేపూ తెస్తున్నామని అన్నారు. చివరిగా ఆయన మరో మాట చెప్పారు. పార్టీ తన ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభిస్తోంది అని. అంటే 2011లో పుట్టిన వైసీపీ 2024 వరకూ నిరాటంకంగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణించింది అనుకోవాలి. అయితే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అయితే ఈ ప్రస్థానంలో ఎక్కడా కనిపించలేదు. తొలిసారి భారీ ఓటమి దక్కింది. దాంతో ఆగి చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
బహుశా ఈ విషయంలో కనుక వైసీపీ అన్నీ ఆలోచించుకుని ముందుకు సాగితే మాత్రం మంచి రోజులు వచ్చినట్లే అని పార్టీవాదులు అంతా అంటున్నారు. వైసీపీ పునర్ నిర్మాణం కానీ మళ్ళీ ప్రయాణం కానీ అన్నీ మేలు చేసేవే అని చెబుతున్నారు. అయితే ఏది చేసినా అది పూర్తి నిబద్ధతతో చేయాలి. ఆత్మ విమర్శ ఎపుడూ మేలు చేసేదే. వైసీపీ ఆ బాటన కానీ నడిస్తే మాత్రం భవిష్యత్తుల్లో మళ్ళీ పుంజుకోవచ్చు. ఆ దిశగానే సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి. సో వైసీపీ ఫ్యాన్ కి రిపేర్లు జరిగి ఆ పార్టీ జెండా ఎగిరితే పార్టీని నమ్ముకున్న లక్షలాది మందికి మేలు జరిగినట్లే అని అంటున్నారు.
