ఈ ఏడాదికి ఇంతే.. జగన్ అభిమానులు సర్దుకోవాల్సిందే.. !
వైసీపీ నాయకులు, జగన్ అభిమానులు ఈసురోమంటున్నారు. ఈ సారికి ఇంతే.. ఈ ఏడాదికి ఇంతే అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 May 2025 1:30 AMవైసీపీ నాయకులు, జగన్ అభిమానులు ఈసురోమంటున్నారు. ఈ సారికి ఇంతే.. ఈ ఏడాదికి ఇంతే అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. సర్దుకుపోతున్నారు. దీనికి కారణం.. ప్లీనరీ. ప్రతి రెండేళ్లకు ఒకసారి అంగ రంగ వైభవంగా నిర్వహించే వైసీపీ ప్లీనరీని ఈ ఏడాది కూడా వాయిదా వేయడమే. తాజాగా వచ్చే ఏడాది ప్లీనరీని వైభవంగా నిర్వహిద్దామని.. వైసీపీ నాయకులకు జగన్ సూచించారు. దీంతో నాయకులు డీలా పడ్డారు.
వాస్తవానికి వైసీపీ ప్లీనరీ అనేది అధికారంలో ఉన్నా.. లేకున్నా ఘనంగా నిర్వహిస్తున్నారు. జూలై 8న వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని దీనిని అట్టహాసంగా నిర్వహిస్తారు. అయితే.. గత ఏడాది పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ప్లీనరీ ఊసేలేకుండా పార్టీ కార్యక్రమాలు సాదాసీదాగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అయినా..పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించి సందేశం ఇవ్వాలన్నది సీనియర్‌ల ఆలోచన.
కానీ, వీరి ఆలోచన ఎలా ఉన్నా.. జగన్ మాత్రం అందరి కాళ్లకు బంధాలు వేసేశారు. వచ్చే ఏడాది జూలై 8న ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న నాయకులు కూడా డీలా పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలోనిపలు ప్రాంతాల్లో నాయకులు బయటకు రావడం లేదు. కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉంది. దీనికితోడు జగన్ కూడా పెద్దగా బయటకు వచ్చి.. కార్యకర్తల కు భరోసా ఇస్తున్నారా? అంటే అది కూడా లేదు.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్లీనరీపై ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తలు. తద్వారా పార్టీకి దశ-దిశ ఏర్పడుతుందని.. తమకు ఊపు వస్తుందని అనుకున్నారు. కానీ, ప్లీనరీని వాయిదా వేయ డంతో పెదవి విరుస్తున్నారు. అయితే.. దీనికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గాల స్థాయిలో నాయకులు లేకపోవడం.. ఉన్నవారిలోనూ ఊప లేకపోవడం వల్ల ప్లీనరీ పెట్టినా.. నవ్వుల పాలవుతామన్న ఆందోళనతోనే జగన్ ఈసారికి వాయిదావేశారని అంటున్నారు. వచ్చే ఏటికి పార్టీ నాయకత్వాన్ని సరిచేసి.. అప్పుడు ప్లీనరీ పెట్టాలన్న యోచనలో ఉన్నారట. ఇదీ.. సంగతి..!