Begin typing your search above and press return to search.

విశాఖలో వైసీపీ పరాజయం సంపూర్ణం

వైసీపీకి ఇపుడు ఉన్న ఆ ఏకైక అధికారం కూడా చేజారిపోయింది. టీడీపీ కూటమి పకడ్బందీగా వేసిన ఎత్తులతో వ్యూహాలతో వైసీపీ చిక్కుకుని చిత్తు అయింది.

By:  Tupaki Desk   |   19 April 2025 1:21 PM IST
YCP Loss Mayor Seat In Vizag
X

విశాఖలో వైసీపీకి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు ఎంపీ తో సహా వైసీపీ భారీ తేడాతో ఓటమి పాలు అయింది. అయినా సరే విశాఖ నగరాన్ని పాలించే మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉంది. దాంతో గత పది నెలలుగా వైసీపీ రాజకీయం చేస్తూ వచ్చింది.

వైసీపీకి ఇపుడు ఉన్న ఆ ఏకైక అధికారం కూడా చేజారిపోయింది. టీడీపీ కూటమి పకడ్బందీగా వేసిన ఎత్తులతో వ్యూహాలతో వైసీపీ చిక్కుకుని చిత్తు అయింది జీవీఎంసీలో వైసీపీ మేయర్ సీటుని కోల్పోవడం స్వయంకృతం అని అంటున్నారు. నాయకులు అంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు.

పార్టీకి బాధ్యులుగా ఉన్న వారు సైతం కూటమి దూకుడుని అడ్డుకోలేపోయారు. దిగ్గజ నేతలు సీనియర్లు ఉన్నా కూడా సీరియస్ గా అవిశ్వాసాన్ని తీసుకోలేదని అంటున్నారు. అందువల్లనే 74 మంది కార్పోరేటర్లను టీడీపీ కూటమి సంపాదించగలిగింది అని అంటున్నారు.

ఇక 2021 ఎన్నికలలో వైసీపీ మొత్తం 98 మంది కార్పోరేటర్లకు గానూ 58 మందిని గెలిపించుకుని స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. మరో ముగ్గురు ఇండిపెండ్ల మద్దతుతో కలుపుకుని వైసీపీ బలం 61 మందికి చేరింది. అయితే ఆ బలాన్ని ఇపుడు సగానికి సగం కోల్పోయినట్లుగా అవిశ్వాసానికి అనుకూలంగా పడిన ఓట్లు చెబుతున్నాయి.

టీడీపీ నుంచి 2021లో 30 మంది గెలిస్తే ఒక కార్పోరేటర్ కరోనాతో చనిపోయారు. దానికి ఉప ఎన్నిక జరిగితే ఆ సీటుని వైసీపీ గెలుచుకుంది. అలా 29 మంది టీడీపీకి ఉంటే జనసేనకు 3, బీజేపీకి 1 ఉన్నారు. అంటే నిఖార్సుగా 33 మంది మాత్రమే కూటమికి జీవీఎంసీలో ఉన్న బలం అన్న మాట. మేయర్ మీద అవిశ్వాసం అంటే మూడింట రెండు వంతుల కార్పోరేటర్ల మద్దతు ఉండాలి. అంటే 74 మంది అన్న మాట.

ఇంతకు ఇంత మంది కార్పోరేటర్లను కూడగట్టడం అంటే కూటమికి చాలా కష్టమైన టాస్క్ గానే ఉంది. కానీ వైసీపీ ఉదాశీనత నిర్లక్ష్యం కారణంగా ఒక్కొక్కరు కూటమి వైపుగా జారిపోతూ వచ్చారు. ఇంత జరిగినా అఖరి నిముషం దాకా కూటమికి గెలుపు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ నంబర్ కాస్తా 72 దగ్గరే ఆగిపోయింది చివరిలో మరో ఇద్దరిని తీసుకుని కూటమి గెలుపు సాధించింది.

అలా కూటమి ఎంతో వ్యూహంతో వ్యవహరిస్తే ముందే అన్ని అస్తాలను వదిలేసి వైసీపీ చతికిలపడి పోయింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న కురసాల కన్నబాబు కానీ వైసీపీ ఓటమిని అడ్డుకోలేకపోయారు. నిజంగా వైసీపీలో ఉన్న కీలక నేతలు తలచుకుంటే కూటమి భారీ లక్ష్యాన్ని ఇంత ఈజీగా చేదించేది కాదు అని అంటున్నారు.

ఎక్కడైనా అధికార పార్టీ నుంచి ప్రలోభాలు ఉంటాయి. ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రయోగిస్తారు. కానీ సగానికి సగం మంది కార్పోరేటర్లు తమకు టికెట్లు ఇచ్చి గెలిపించిన వైసీపీతో నాలుగేళ్ళ పాటు ఉండి చివరి ఏడాది వదిలేశారు అంటే ఆలోచించుకోవాల్సింది వైసీపీ నాయకత్వం అని అంటున్నారు.

విశాఖ అంటేనే కూటమికి బలమున్న ప్రాంతం. అలాంటి చోట మేయర్ సీటుతో వైసీపీ ఉండడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవహారమే. ఆ ప్రాధాన్యతను ఆ అవసరాన్ని అర్ధం చేసుకుని వైసీపీ నిలబెట్టుకోలేకపోయింది అని అంటున్నారు.

కనీసం ఒక అరడజన్ మందిని వైసీపీ గేటు దాటకుండా ఆపినా అయిదేళ్ళ పాటూ మేయర్ సీటు వైసీపీ వద్దనే ఉండేదని అంటున్నారు. కానీ వైసీపీ స్థానిక నాయకత్వం చేష్టలుడిగి చోద్యం చూసిన తీరుతోనే ఇంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు. వైసీపీలో అందరూ అగ్ర నేతలే. కానీ ఎవరికి వారుగానే ఉంటూ వచ్చారు రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అందుకున్న కన్నబాబు తన వ్యూహాలను ఎక్కడా చూపించలేకపోయారు అన్న విమర్శలు వస్తున్నాయి.

మొత్తం మీద చూస్తే విశాఖ జిల్లాలో వైసీపీకి ఉన్న ఏకైక అధికార కేంద్రాన్ని పోగొట్టుకుని పూర్తి ఓటమిని బహుమతిగా స్వీకరించింది అని అంటున్నారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే విశాఖ జిల్లాలో ఫ్యాన్ పార్టీ పునరుత్తేజం మీద ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.