Begin typing your search above and press return to search.

మాజీ మేయర్ మౌనం,,, వైసీపీకి దూరం ?

అలా గ్రౌండ్ లెవెల్ లో కూడా కూటమి అధికారాలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పదవులు పోగొట్టుకున్న వారు అంతా నిరాశలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 6:45 PM
మాజీ మేయర్ మౌనం,,, వైసీపీకి దూరం ?
X

వైసీపీ విపక్షంలో ఉంది. కష్టాలు అన్నీ ఒక్కోటిగా వెంట వస్తున్నాయి. నాలుగేళ్ల స్థానిక సంస్థల పాలన ముగియడంతో నియమ నిబంధనల మేరకు వైసీపీ మేయర్లు చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ టీడీపీ నేతలు వారిని దించేస్తున్నారు. ఆ ప్లేస్ లో తమ వారిని ఎక్కించేసి స్థానిక పాలనలో పై చేయి సాధిస్తున్నారు.

అలా గ్రౌండ్ లెవెల్ లో కూడా కూటమి అధికారాలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పదవులు పోగొట్టుకున్న వారు అంతా నిరాశలో ఉన్నారు. కొందరు అయితే రాజకీయాలకు కూడా దూరం పాటిస్తున్నారు. నిన్నటి దాకా అధికారంలో ఉంటూ ఒక వెలుగు వెలిగిన వారు ఇపుడు మాజీలుగా చిన్నబోతున్నారు. దాంతో మెజారిటీ ఉండి కూడా సరైన వ్యూహాలు అవలంబించ లేకపోవడం వల్లనే తమ పదవులకు ఎసరు వచ్చిందని భావించే వారు కూడా వైసీపీలో ఉన్నారని చెబుతున్నారు.

ప్రతిష్టాత్మకమైన విశాఖ కార్పోరేషన్ మేయర్ పీఠం కోసం టీడీపీ కూటమి పక్కాగా స్కెచ్ వేసి మరీ ఆ సీటు కొట్టేసింది. దాంతో నాలుగేళ్ళ పాటు మేయర్ గా ఉన్న వైసీపీ మహిళా నాయకురాలు హరి వెంకట కుమారి మాజీ అయ్యారు. ఇక గత ఏప్రిల్ నెలలో ఆమె పదవి పోయింది నాటి నుంచి ఆమె వైసీపీలో ఎక్కడా కనిపించడంలేదు.

ఆమె రాజకీయ వైరాగ్యం పాటిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆమె ఆ పదవి కోల్పోయారు అంటే వైసీపీ రాజకీయ వ్యూహం తప్పు ఉందని కూడా భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే ఆమె సమర్ధవంతంగా మేయర్ పదవిని నిర్వహించారు.

ఆమె మీద అవినీతి ఆరోపణలు కూడా లేవు. విద్యాధికురాలిగా ఉన్నారు. దాంతో పార్టీలో మనంచి పొజిషన్ దక్కుతుందని ఆమె భావించారు అని అంటారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా బాధ్యతలను ఆమె ఆశించారు అని ప్రచారంలో ఉంది. 2029 ఎన్నికల్లో పోటీకి ఆమె ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని కూడా ప్రచారం సాగింది. అయితే వైసీపీ హై కమాండ్ మాత్రం మాజీ కార్పోరేటర్ ఒకరికి ఆ పదవిని ఇచ్చింది.

దాంతో ఆమె అసంతృప్తికి లోను అయ్యారు అని అంటున్నారు. ఈ కారణంగానే ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు అని అంటున్నారు. మరి వైసీపీ ఆమెకు ఏ రకమైన బాధ్యతలు అప్పగిస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంల్ సన్నాహాల సమావేశాలలోనూ అనేక మంది సీనియర్ నేతలు కనిపించడం లేదు. దాంతో వైసీపీలో అసంతృప్తులు ఇంకా అలాగే ఉన్నాయని చర్చ సాగుతోంది. వీటిని తగ్గించేందుకు వైసీపీ హై కమాండ్ ఏమి చేస్తుంది అన్నదే అంతా చర్చిస్తున్నారు.