Begin typing your search above and press return to search.

చిన్నపిల్లల సైకిల్ పై వైసీపీ పెద్దల ప్రతాపం... లోకేష్ ధ్వజం!

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు మరింత ప్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారని టీడీపీ నేతలు నిత్యం ఆరోపిస్తుంటారు! దానిని నిజం చేస్తున్నట్లుగా తాజాగా చిన్నపిల్లాడిపైనా వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారు!

By:  Tupaki Desk   |   2 Jun 2025 1:47 PM IST
YCP Leaders Destroy Child’s Bicycle, Sparking Political Outrage in Andhra Pradesh
X

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు మరింత ప్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారని టీడీపీ నేతలు నిత్యం ఆరోపిస్తుంటారు! దానిని నిజం చేస్తున్నట్లుగా తాజాగా చిన్నపిల్లాడిపైనా వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారు! ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అవును... పసుపు రంగు జెండా చూస్తే వైసీపీ నేతలు ఎర్రెత్తిపోతున్నారంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. ఇక.. సైకిల్ చూసినా వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జోగి రమేష్ కుమారుడు వివాహ వేడుక కోసం వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం వచ్చారు. ఆ సమయంలో కొంతమంది స్థానిక వైసీపీ శ్రేణులు రోడ్డు వెంట ఓ చిన్నపిల్లాడి సైకిల్ లాగి ధ్వంసం చేశారు! దీన్ని టీడీపీ మద్దతుదారులను రెచ్చగొట్టే చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. చిన్నారి సైకిల్ లాక్కొని, కిందపడేసి తొక్కడం ఇదేమి పైశాచికానందం అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా... "అబ్బే వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా" అని మొదలుపెట్టిన లోకేష్.. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో కానీ, ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు.. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ, వాళ్ళకి సైకో నాయకుడు! అంటూ ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో... ప్రజలు బుద్ది చెప్పినా వారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతిలో నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ వాళ్లు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్ధం చేసుకోవాలని రాస్తూ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

మరోపక్క వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన బాలుడి సైకిల్ కు బదులుగా టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు ఆదివారం కొత్త సైకిల్ ను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.