Begin typing your search above and press return to search.

లిస్టు చాలా పెద్దదే..! చాంతాడులా అరెస్టు అయ్యే వైసీపీ నేతల జాబితా..

రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతారో తెలియడం లేదని వైసీపీ టెన్షన్ పడుతోంది. ఒకరి తర్వాత ఒకరిని ప్రభుత్వం టార్గెట్ చేయడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది.

By:  Tupaki Desk   |   26 May 2025 11:00 PM IST
లిస్టు చాలా పెద్దదే..! చాంతాడులా అరెస్టు అయ్యే వైసీపీ నేతల జాబితా..
X

రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతారో తెలియడం లేదని వైసీపీ టెన్షన్ పడుతోంది. ఒకరి తర్వాత ఒకరిని ప్రభుత్వం టార్గెట్ చేయడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డితో మొదలుపెట్టిన అరెస్టుల పర్వం తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరకు వచ్చింది. ఈ పరంపరలో నెక్ట్స్ ఎవరు? అన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, వైసీపీ నేతలు పోసాని క్రిష్ణమురళి వంటివారు అరెస్టు అయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, జోగి రమేశ్, కొడాలి నాని, పేర్ని నాని, ఆర్ కే రోజా, వైసీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సీదిరి అప్పలరాజు, అనిల్ కుమార్ యాదవ్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సోషల్ మీడియా మాజీ ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి వంటి వారిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు.

అయితే మాజీ మంత్రి కాకాణి అరెస్టు తర్వాత ఎవరిని అరెస్టు చేస్తారనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డితోపాటు సజ్జల భార్గవరెడ్డి సుప్రీం రక్షణతో అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ఆయనను ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయనపై మదనపల్లె సబ్ కలెక్టరేట్ దహనం కేసుతోపాటు భూ కబ్జా కేసులు నమోదుచేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక గత ప్రభుత్వంలో నోరు అదుపు లేకుండా మాట్లాడిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అరెస్టుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. కొడాలిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బియ్యం అక్రమ తరలింపు కేసులో పేర్నికి బెయిలు లభించినా, ఆయన ఇటీవల హంగామా ఎక్కువగా చేస్తున్నారని ప్రభుత్వం సీరియస్ గా ఉందని అంటున్నారు. మరోవైపు ఆడుదాం ఆంధ్రా అవినీతి కేసులో మాజీ మంత్రి రోజాపైనా చర్యలు ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తల్లో టెన్షన్ కనిపిస్తోంది. నేతలను వరుసగా ప్రభుత్వం అరెస్టు చేస్తున్నా, న్యాయ సహాయం సరిగా అందడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వంశీ కేసునే ఉదహరిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ స్వయంగా వంశీ కేసు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ పరంగా న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే వంశీకి వంద రోజులు అవుతున్నా జైలు నుంచి బయటకు తేలేకపోవడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.