వైసీపీలోని నాని కాదు శ్వేత ?
వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిల మార్పు మీద ఫోకస్ పెడుతోంది.
By: Tupaki Desk | 26 May 2025 9:06 AM ISTవైసీపీ అధినాయకత్వం సీరియస్ గా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిల మార్పు మీద ఫోకస్ పెడుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన కొన్ని కీలక నియోజకవర్గాలలో పాత వారిని మార్చి కొత్త వారికి చాన్స్ ఇవ్వబోతోంది. అందులో భాగంగా ఫ్రెష్ లుక్ ని యంగ్ బ్లడ్ ని రాజకీయాల్లోకి తేవాలని చూస్తోంది.
ఈ క్రమంలో వైసీపీ అధినాయకత్వం చూపు మాజీ ఎంపీ కేశీనేని నాని కుమార్తె శ్వేత మీద పడింది అని అంటున్నారు. ఆమె రాజకీయాలకు అయితే కొత్త కాదు, 2021లో కార్పోరేటర్ గా విజయవాడ నుంచి గెలిచారు. ఆమె మేయర్ అభ్యర్ధిగా కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆమె మేయర్ అయ్యేవారే. కానీ టీడీపీలో ఆనాడు ఉన్న అంతర్గత వైరాల వల్ల ఆ పార్టీ ఓటమి పాలు అయింది. అలా శ్వేత కేవలం కార్పోరేటర్ గానే మిగిలిపోయారు.
ఇక ఆనాటి పరిణామాలను మనసులో ఉంచుకునే కేశినేని నాని కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఆయనతో పాటు శ్వేత కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2024లో వీచిన కూటమి ప్రభంజనంలో నాని ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన రాజకీయ సన్యాసమే తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన తన సోదరుడు విజయవాడ టీడీపీ ఎంపీ అయిన కేశినేని చిన్ని మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు మళ్లీ ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారని వైసీపీ లేదా బీజేపీలో చేరుతారని ప్రచారం ఒక వైపు సాగుతోంది.
మరో వైపు ఆయన వస్తే వైసీపీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అయితే ఆయన రాకపోయినా ఆయన కుమార్తె కేశినేని శ్వేతను పార్టీలో కీలకమైన స్థానంలో ఉంచాలని ఆలోచిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. విజయవాడ తూపు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి బాధ్యతలను ఆమెకు అప్పగించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
విజయవాడ తూర్పు టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు, ఇక్కడ నుంచి వరసగా అనేక సార్లు గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ సీటు నుంచి 2024 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ని వైసీపీ పోటీ చేయించింది. అయితే కూటమి ప్రభంజనంలో ఆయన ఓటమి పాలు అయ్యారు.
ఇక ఇపుడు చూస్తే కనుక దేవినేని అవినాష్ ప్లేస్ లో కేశినేని శ్వేతను బరిలోకి దింపాలని చూస్తున్నారు. అక్కడ కేశినేని నానికి మంచి పట్టు ఉంది. దాంతో కుమార్తె కోసం ఆయన కూడా గట్టిగా పనిచేస్తారని ఆ విధంగా 2029 ఎన్నికల్లో వైసీపీకి అక్కడ గెలిచే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే దేవినేని అవినాష్ మరోసారి తూర్పు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు.
ఇంకో వైపు కేశినేని నాని వీలుంటే బీజేపీలోకి కుమార్తెతో సహా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీ ఆలోచనలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా కేశినేని నాని కుటుంబం మీద వైసీపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టిందని వారిని పార్టీలోకి తిరిగి రప్పించాలని చూస్తోందని అంటున్నారు.
