వైసీపీ యాక్షన్.. ఆ పోలీసులోళ్లకు పనిష్మెంట్ టెన్షన్!
పోలీసు శాఖలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటోన్న అధికారులు, ఉద్యోగుల పక్షాన వైసీపీ చేసిన న్యాయపోరాటం మిస్ ఫైర్ అయిందా? అనే చర్చ జరుగుతోంది
By: Tupaki Desk | 6 Nov 2025 11:00 PM ISTపోలీసు శాఖలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటోన్న అధికారులు, ఉద్యోగుల పక్షాన వైసీపీ చేసిన న్యాయపోరాటం మిస్ ఫైర్ అయిందా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి కారణంగా తమకు మేలు జరగకపోగా, ప్రభుత్వం వద్ద మరింత చెడ్డ అయ్యామంటూ పలువురు ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు తలలు బాధుకుంటున్నారు. తాము సాయం చేయమని అడగపోయినా, తమను ఉద్దరించేలా వైసీపీ చేసిన హడావుడితో ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే 17 నెలలుగా పోస్టింగులు, జీతాలు లేక అల్లాడిపోతున్న పోలీసు అధికారులు.. వైసీపీ చేసిన పనితో మరికొన్నాళ్లు పనిష్మెంట్ అనుభవించక తప్పదా? అంటూ తలలు పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వీఆర్ లో ఉన్న పోలీసులకు తక్షణం పోస్టింగులు ఇవ్వడంతోపాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ బోర్డు ద్వారానే బదిలీలు, నియామకాలు జరిగేలా ప్రభుత్వానికి నిర్దేశం చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేశారు. పోలీసు అధికారులను దీర్ఘకాలం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ఉండటంపైనా విచారణకు ఆదేశించాలని ఆయన ఆ వ్యాజ్యంలో కోరారు. బుధవారం ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు, పోలీసు శాఖను నడిపించడం తమ బాధ్యత కాదని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఉద్యోగులు, అధికారుల సేవలను ఎలా వినియోగించుకోవాలో పోలీసు శాఖకు తెలుసని, ఫలానా విధులు అప్పగించమని తాము నిర్దేశించలేమని తేల్చిచెప్పింది.
దీంతో వీఆర్ లో ఉన్న పోలీసులకు కొత్త టెన్షన్ మొదలైనట్లు చెబుతున్నారు. నిజానికి వీఆర్ లో ఉన్న పోలీసుల కోసమే వైసీపీ ఎంపీ పిటిషన్ వేసినా, కోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఈ విషయంలో స్వేచ్ఛ లభించినట్లైంది. ఏ ప్రభుత్వం ఉన్నా కొందరు పోలీసులను వీఆర్ లో ఉంచడం ఒక పరిపాటిగా చెబుతారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లేదా తగిన పోస్టు ఖాళీ అయ్యేవరకు పోలీసులను వెయిటింగులో పెడుతుంటారు. కొన్నిసార్లు రాజకీయంగా మాట వినని వారిని, తమ ప్రత్యర్థులతో సఖ్యతగా మెలిగిన వారిని ఇలా పక్కన పెట్టేస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు ఇలానే ఐదేళ్లు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం వీఆర్ లో ఉంచిన వారికి పోస్టింగులు ఇవ్వాలని కోర్టుకు ఎక్కి ఆ పోలీసుల సానుభూతి పొందాలని చూసి, వారికి మరింత ముప్పు తెచ్చిపెట్టిందని విమర్శలు ఎదుర్కొంటోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు పోలీసులను విధుల నుంచి తప్పించింది. పలు రకాల ఆరోపణలపై కొందరిని సస్పెండ్ చేయగా, మరికొందరికి వీఆర్ లో పెట్టింది. ఇందులో ఐపీఎస్ అధికారుల నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 199 మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబెతున్నాయి. గత ప్రభుత్వంలో నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా మెలిగారని ప్రచారంలో ఉన్న ఐపీఎస్ లు పీవీ సునీల్ కుమార్, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్, పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి తదితర అధికారులను ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు కింద పక్కన పెట్టింది. అయితే వీరికి పోస్టింగులు ఇప్పించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావించిన వైసీపీ కోర్టులో పిల్ వేయించింది.
అయితే కోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ వేసిన పిటిషన్ కు తామే కారణంగా భావించి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని కొందరు పోలీసు అధికారులు టెన్షన్ పడుతున్నారు. పదహారు నెలలుగా పోస్టింగులు లేక తీవ్ర అవమాన భారాన్ని మోస్తున్న వారు, ప్రభుత్వం శాంతిస్తుందని, మనసు మారుతుందని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీసీ చేసిన పనితో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లైందని అంటున్నారు. దీనివల్ల ఎప్పటికీ ప్రభుత్వం వద్ద తాము మంచి మార్కులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆ అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే తమను వైపీఎస్ అంటూ టీడీపీ అనుకూల మీడియా ట్రోల్ చేస్తుందని, వైసీపీ ఎంపీ చేసిన పనితో నిజంగా ఆ పేరు ఖాయం చేసేలా ఉందని ఆవేదన చెందుతున్నారు.
