అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ.. వైసీపీ తీవ్ర అసంతృప్తి
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
By: Tupaki Desk | 10 Aug 2025 5:31 PM ISTపులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ రెండు చోట్ల అధికార పార్టీ అరాచకాలు పేట్రేగిపోతున్నాయని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని పోలీసులకు సరైన దిశానిర్దేశం చేయాలని కోరేందుకు డీజీపీని కలవాలని రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా, తమను కలిసేందుకు డీజీపీ కనీసం ఇష్టపడటం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తున్నందున, వచ్చే రెండు రోజులు సరైన భద్రత కల్పించాలని కోరేందుకు ఈ రోజు కూడా వైసీపీ ప్రయత్నించిందని చెబుతున్నారు. అయితే డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఆవేదన, ఆందోళనను వెలిబుచ్చారు.
అసలు పోటీ పోలీసులతోనే..
పోలీసుల వ్యవహారశైలి కారణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమకు పోలీసులకు మధ్యే పోటీ జరుగుతుందన్న వాతావరణం నెలకొందరి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఒకవైపు, కూటమి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయని, అయితే అసలైన పోటీ పోలీసులతోనే అని అర్థమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు, దాడులకు గురైన మా పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తారు, బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధిస్తారు, దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు’’ అంటూ లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.
వినతిపత్రం ఇచ్చే పరిస్థితి లేదు
ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిస్తే, అది పోలీసులు గెలిచినట్లుగా భావించాలన్నారు. ‘‘దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి గురించి వినలేదు. డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా డీజీపీ నుంచి సమయం ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు? ఎవరి ఒత్తిడితో డీజీపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధి బృందం నుంచి కనీసం స్వేచ్ఛగా వినతిపత్రంను కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు?’’ అంటూ ప్రశ్నించారు.
పోలింగ్ కేంద్రాలను మార్చేశారు
మరోవైపు ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రామాలకు మార్చేశారు. ఓటర్లు ఏ ధైర్యంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? పోలీసులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును టీడీపీ గూండాలు కాలరాస్తుంటే, పోలీసులు వారికి అండగా నిలబడటం దారుణం. ఇప్పటికైనా డీజీపీ కళ్ళు తెరవాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.
