Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రభుత్వంపై ‘యార్లగడ్డ’ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ ప్రభుత్వంపై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 March 2024 9:27 AM GMT
వైసీపీ ప్రభుత్వంపై ‘యార్లగడ్డ’ సంచలన వ్యాఖ్యలు!
X

వైసీపీ ప్రభుత్వంపై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ– జనసేన కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని యార్లగడ్డ గ్రాండియర్‌ కళ్యాణ మండపంలో గన్నవరం నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

టీడీపీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌ కి యార్లగడ్డ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పని చేయాలని కోరారు. గ్రామ స్థాయిలో టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం చేయాలన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ శ్రేణులతో పాటు జనసైనికులకు సైతం తగిన గౌరవం ఉంటుందని తెలిపారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ఏర్పడే ఉమ్మడి ప్రభుత్వంలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై కార్యకర్తలకు పలు సలహాలు, సూచనలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ శ్రేణులతో పాటు జనసైనికులు, బీజేపీ శ్రేణులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. టీడీపీ ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలలన్నారు. గడపగడపకు శంఖారావం కార్యక్రమాన్ని ఉధృతం చేయాలన్నారు.

గన్నవరం నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్యాయం జరిగిందని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే వారి మీదే కేసులు పెట్టే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటప్పుడు పోలీస్‌ స్టేషన్లు మూసివేయాలని యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెలాంటి అవినీతికి పాల్పడలేదని, కొండలు, గుట్టలు తవ్వలేదని, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించలేదని, అలాంటప్పుడు తనను పోలీసులు ఏమీ చేయలేరన్నారు.

తానే పోలీసుల్ని హెచ్చరిస్తున్నానని, తీరు మారకుంటే నారా లోకేష్‌ రెడ్‌ డైరీలో ఇక్కడి అధికార్ల పేర్లు కూడా ఉంటాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వీఆర్‌ కు పంపడం ఖాయమన్నారు. గన్నవరం టీడీపీకి కంచుకోటని రానున్న ఎన్నికల్లో ఘన విజయం ద్వారా ఈ విషయం మరోసారి రుజువవుతుందన్నారు.

కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ గా అవకాశం దక్కించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీమోహన్‌ దక్కించుకున్నారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడారు. టీడీపీలో చేరి గన్నవరం టికెట్‌ ను దక్కించుకున్నారు.