ప్రభుత్వం మీద అసంతృప్తి...యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు
తనకు కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నట్లుగా వస్తున్న వార్తల మీద ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన కామెంట్స్ చేశారు.
By: Satya P | 13 July 2026 11:12 PM ISTతనకు కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నట్లుగా వస్తున్న వార్తల మీద ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన కామెంట్స్ చేశారు. తాను ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే రాజకీయాలు మానేస్తానే తప్ప అసంతృప్తి అంటూ మాట్లాడను అని ఆయన స్పష్టం చేశారు. అసలు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే ప్రభుత్వ విప్ పదవిలో తాను ఎందుకు కొనసాగుతాను అని ఆయన ప్రశ్నించారు. తాను అసంతృప్తిగా ఉన్నాను అంటూ వస్తున్న వార్తల పట్ల ఆయన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఎలాంటి వ్యతిరేకత లేదు :
తనకు ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకం ఉందని యార్లగడ్డ చెప్పారు. అంతే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. తాను కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను అసంతృప్తిగా కొందరు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్దారు. తాను ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పానా అని ఆయన ప్రశ్నించారు. ఎయిర్ పోర్టు టెండర్ల విషయంలో ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బందరు, విజయవాడ ఎంపీలతో పాటు తాను కూడా సహజంగానే కాంట్రాక్ట్ విలువ ఎంత అని అడిగానే తప్ప ఎలాంటి టెండర్లు కోరలేదని యార్లగడ్డ వివరణ ఇచ్చారు. ఒక వేళ టెండర్లు అడిగినట్లు నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని ఆయన వైసీపీ మీడియాకు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి బహిరంగ సవాల్ విసిరారు.
బాబు చేత కంటతడి పెట్టించారు :
చంద్రబాబు మహోన్నతమైన నాయకుడు అని యార్లగడ్డ అన్నారు. అలాంటి నాయకుడి చేత కంటతడి పెట్టించిన వల్లభనేని వంశీ మీద పోటీ చేసి గత ఎన్నికల్లో తాను గెలిచాను అని ఆయన గుర్తు చేశారు.
తాను ఏదైనా మాట్లాడితే క్యాడర్ ప్రయోజనం కోసమే తప్ప వ్యక్తిగతం ఉండదని అన్నారు. తాను ఎపుడూ పార్టీ లైన్ ధిక్కరించింది కూడా లేదని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం వేళ వల్లభనేని వంశీ అనుచరుడికి ఎనిమిది కోట్ల రూపాయల చెక్ రావడంపై తాను మాట్లాడటంలో తప్పేముందని యార్లగడ్డ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో వల్లభనేని వంశీ కోసం పనిచేసిన వారికి ఆయనకు చందాలు ఇచ్చిన వారికి కనుక కాంట్రాక్టులు ఇస్తే తన కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉంటుందని ఆయన అన్నారు.
రాజకీయ దుమారం కోసమే :
తాను పార్టీ క్యాడర్ అంతర్గత సమావేశంలో మాట్లాడిన మాటలను రాజకీయ దుమారం కోసం వక్రీకరించారు అని యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలన నుంచి గన్నవరాన్ని కాపాడుకోవడానికి తాము అంతా ఎంతో కష్టపడ్డామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి కార్యకర్తలు అందరికీ న్యాయం జరగాలన్నదే తన ఆలోచన తప్ప మరో ఉద్దేశ్యం లేదని ఆయన వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఏవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని ఆయన స్పష్టం చేశారు.
రచ్చ వద్దే వద్దు :
తామంతా ఒక్కటి అని ఆయన కూటమి పార్టీల గురించి చెప్పారు. టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు అసలు లేవని అన్నారు. అంతా కలసికట్టుగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సొషల్ మీడియాగా చేసుకుని ఈ విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మావద్దని ఆయన గట్టిగా కోరారు. ఎక్కడైనా చిన్న లోపాలు ఉన్నా అంతా కో ఆర్డినేట్ అయి చర్చించుకుంటాం తప్ప రచ్చ చేసుకోవాల్సిన పని లేదని యార్లగడ్డ అన్నారు. మొత్తానికి యార్లగడ్డ పార్టీ వేదికగా చేసిన వ్యాఖ్యల మీద చెలరేగిన దుమారానికి అతి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేసారు అన్న మాట.
