Begin typing your search above and press return to search.

యనమల కు సీన్ అర్ధమైందా ?

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా యనమల రామకృష్ణుడిని చెప్పుకోవాలి. ఆయన 1982 నుంచి పార్టీలో ఉన్నారు.

By:  Satya P   |   2 Jun 2026 9:02 AM IST
యనమల కు సీన్ అర్ధమైందా ?
X

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా యనమల రామకృష్ణుడిని చెప్పుకోవాలి. ఆయన 1982 నుంచి పార్టీలో ఉన్నారు. ఎన్నో సార్లు కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఇక ఆర్ధిక మంత్రిగా ఆయన రికార్డు వేరు. అనేక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అంతే కాదు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఆయన నైపుణ్యం గురించి కూడా చెప్పుకోవాల్సిందే. స్పీకర్ గా కూడా ఆయన 1995 నుంచి 2000 దాకా పనిచేసి తనదైన మార్క్ ని చూపించారు. ఎమ్మెల్సీగా పన్నెండేళ్ళ పాటు పనిచేసిన యనమల 2025 మార్చి 30తో తన ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయితే యనమల జీవిత కాలం కోరికగా ఒకటి ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడు కావాలన్నదే ఆ కోరిక అని చెబుతున్నారు.

నాలుగు ఖాళీలతో :

ఇక ఈసారి ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఖాళీలు ఏర్పడుతున్నాయి. అందులో మూడు టీడీపీకి దక్కుతాయని కూడా ప్రచారంలో ఉన్న మాట. దాంతో అందులో ఒకటి తనకు దక్కుతుందని ఆయన ఆశిస్తూ వచ్చారు అని అంటున్నారు. ఇక మహానాడు తీర్మానాల చైర్మన్ గా కూడా యనమల వ్యవహరించి వేదిక మీద కూడా ఆసీనులు అయి మొత్తం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అయితే మహానాడులో జూనియర్లకు యువతకు పెద్ద పీట వేయడం మహిళలకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని 33 శాతం సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేస్తామని టీడీపీ ప్రకటించడం వంటి నిర్ణయాలను ఆయన స్వయంగా చూశారు. తీర్మానాల కమిటీ చైర్మన్ కాబట్టి ఆయనకు అన్నీ ముందే అవగాహన ఉంది.

ఈసారి కాకపోతే :

ఇక యనమల రామక్రిష్ణుడు విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఏడున్నర పదుల వయసు దాటారని అంటున్నారు. ఈసారి రాజ్యసభకు నామినేట్ అయితే ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కుదురుకుని హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు ఆయనకు సరైన సమయం అని భావిస్తున్నారు. ఇపుడు కాకపోతే మళ్ళీ 2028 దాకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటికి యనమల కూడా ఎనభైకి దాదాపుగా చేరువకు వచ్చేస్తారు అని అంటున్నారు. దాంతో తనకు ఇదే చివరి అవకాశంగా ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే పరిస్థితులు చూసినా సమీకరణలు చూసినా టీడీపీలో కొత్త తరం ఆశలు నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకుంటున్న చర్యలను చూసినా సీనియర్లకు చాన్స్ తక్కువే అన్న మాట వినిపిస్తోంది. దాంతో యనమలకు సీన్ అర్ధమైందా అన్న చర్చ సాగుతోంది. మహానాడులోనూ తరువాత కూడా ఆయన పెద్దగా మాట్లాడింది లేదని గుర్తు చేస్తున్నారు

యువతకే పెద్ద పీట :

ఈ క్రమంలో ఈసారి రాజ్యసభకు టీడీపీ తీసుకునే మూడు సీట్లనూ యువతకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అందులో ఒక సీటు ఉత్తరాంధ్ర జిల్లాలాకు చెందిన ఉమండి విశాఖ నుంచి మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ కి ఇస్తారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఐ టీడీపీ చైర్మన్ గా ఉన్న విజయ్ లోకేష్ బృందంలో కీలకంగా ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబుకు అయ్యన్న ఎలాగో రేపటి రోజున లోకేష్ కి విజయ్ అలా వెన్ను దన్నుగా ఉంటారని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో కూడా వెనక్కి తగ్గకుండా పోరాడిన కుటుంబంగా భావించి ఆ సీటు ఆయనకు కన్ఫర్మ్ చేశారు అని అంటున్నారు. అలాగే ఒక సీటుని యువ నేత సానా సతీష్ కి రెన్యూవల్ చేస్తారని అంటున్నారు. ఇంకో సీటుని కిలారి రాజేష్ కి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. దీని వల్ల మూడు ప్రధాన సామాజిక వర్గాలు మూడు ప్రాంతాలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని భావిసున్నారు. ఒక విధంగా చూస్తే ఈ పేర్లు ఖరారు అవుతాయని ప్రచారం అయితే సాగుతోంది.