Begin typing your search above and press return to search.

యనమలను ఎవరూ పట్టించుకోవడం లేదా? ఎందుకీ పరిస్థితి?

2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికై ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 3:00 PM IST
యనమలను ఎవరూ పట్టించుకోవడం లేదా?  ఎందుకీ పరిస్థితి?
X

సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గుర్తింపు లేదని మదన పడుతున్నారా? ఎన్నికల్లో పోటీకి దూరమంటూ గతంలో ప్రకటించిన యనమల పార్టీలో అధికారంలో ఉండటంతో యాక్టివ్ గా ఉండాలని అనుకుంటున్నారు. తన సహచరులైన సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి వంటివారు అస్త్ర సన్యాసం చేసి తమ బాధ్యతలను వారసులకు అప్పగించినా యనమల మాత్రం క్రియాశీలంగానే ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. దీంతో నిత్యం వార్తల్లో నిలిచేలా ఆయన ప్రకటనలు చేస్తున్నారు. అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, సీనియర్ నేత యనమలకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన యనమల తన స్థానంలో వరుసకు సోదరుడైన యనమల క్రిష్ణుడిని ప్రోత్సహించారు. అయితే ఆయన వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతో గత ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్యను బరిలోకి దింపారు. ఈ సారి యనమల సీనియార్టీ, పార్టీ హవా కలిసొచ్చి దివ్య సునాయాశంగా గెలిచారు. అలా తుని నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత జెండా ఎగరేసిన యనమల తనకు కూడా పదవి ఉంటే బాగుంటుందని పార్టీకి సంకేతాలిస్తున్నారు.

2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికై ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. ఆరు నెలల క్రితం యనమల ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి కావడంతో ఆయన మాజీ అయ్యారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఆయనకు మరోమారు రెన్యువల్ ఉంటుందని భావించారు. అయితే ఆశావహులు ఎక్కువగా ఉండటం, పొత్తు ధర్మం వల్ల యనమలకు పొడిగింపు ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో యనమల కొంత అసంతృప్తికి లోనయ్యారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ నాయకత్వం ఆయనకు సర్దిచెప్పడంతో అలక మూన్నాళ్లకే ముగిసిందని అంటున్నారు. అయితే ఆ సమయంలో తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన ఉందన్న విషయాన్ని యనమల పార్టీకి నివేదించారు. దీనిపై అధినేత నుంచి ఎలాంటి స్పందన రాలేదంటున్నారు.

దీంతో వయసు ఎక్కువగా ఉండటం వల్ల అధినేత చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని భావిస్తున్న యనమల ఇటీవల స్పీడు పెంచారు. నలబైయేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఆయన చేస్తున్న ప్రకటనలు చర్చనీయాంశమవుతున్నాయి. వైసీపీ అంటే ఏ ఒక్కరికీ పని చేయొద్దని యనమల ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు తన సొంత నియోజకవర్గం తునిలో కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ యనమలే యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ పరమైన నిర్ణయాలతోపాటు అభివృద్ధి పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. తాను ఇంత యాక్టివ్గా ఉన్న అధిష్టానం పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆయనలో కనిపిస్తోందని యనమల అనుచరులు చెబుతున్నారు.

మీడియా సైతం యనమలకు సరైన ప్రచారం ఇవ్వడం లేదని యనమల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత అన్న కారణం తప్ప, యనమలకు ఏ ప్రొటోకాల్ లేకపోవడం వల్ల ఆయనకు తగిన గౌరవం లభించడం లేదన్న చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా సీనియర్ నేతలకు తగిన గౌరవం కల్పించాల్సివున్నందున యనమలకు ప్రొటోకాల్ పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు పట్టుబడుతున్నారని చెబుతున్నారు. తమ నేతను పట్టించుకోవాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.