ఆగి ఉన్న లారీని ఢీ కొన్న కారుతో ఆరు ప్రాణాలు బలి
వేసవి సెలవుల వేళ.. యాదగిరి గుట్టకు వెళ్లి.. గోల్డెన్ టెంపుల్ లో స్వామిని దర్శించుకొని.. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళుతున్న రెండుకుటుంబాల్ని ఒక ఘోర రోడ్డు ప్రమాదం చిదిమేసింది.
By: Tupaki Desk | 2 May 2026 9:50 AM ISTవేసవి సెలవుల వేళ.. యాదగిరి గుట్టకు వెళ్లి.. గోల్డెన్ టెంపుల్ లో స్వామిని దర్శించుకొని.. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళుతున్న రెండుకుటుంబాల్ని ఒక ఘోర రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఏకంగా ఆరుగురు బలైన దారుణ ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు పదహారు వద్ద ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొనటంతో ముగ్గురు చిన్నారులతో సహా ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఘటనా స్థలంలో గుర్తు పట్టలేని విధంగా కారు తుక్కుతుక్కుగా మారితే.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో యాదాద్రికి వెళ్లిన రెండు కుటుంబాల వారు. వరుసకు అక్కచెల్లెళ్ల కుటుంబాలు ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలోకి వెళితే.. సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీరామ బీడీ కంపెనీ యజమాని బొల్లి రాజు.. భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు శివకుమార్, ఆయన భార్య రాజేశ్వరి వారి కుమార్తె రిషిత.. శివకుమార్ సోదరి శ్వేత.. భర్త శ్రీనివాస్.. వారిద్దరి పిల్లలు క్రిష్ణ చంద్ర, మాధవ్ లు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని సనత్ నగర్ నుంచి యాదాద్రికి వెళ్లారు.
ఈ ప్రయాణానికి శివకుమార్ తన సొంత కారు వ్యాగనార్ లో బయలుదేరి వెళ్లారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకన్న అనంతరం అక్కడి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి బయల్దేరారు. అక్కడ దర్శనం పూర్తయ్యాక గచ్చిబౌలిలో షాపింగ్ చేసుకొని సనత్ నగర్ వెళ్లాలన్నది వారి ప్లాన్. ఇందులో భాగంగా ఘట్ కేసర్ లో టోల్ 9 వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కారు. సాయంత్రం నాలుగు గంటల వేళలో శంషాబాద్ ఎగ్జిట్ సమీపంలోకి వీరు కారు వచ్చిన వేళ.. ఔటర్ రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీ కొట్టింది.
ఈ లారీ సూర్యాపేట నుంచి నంద్యాలకు బియ్యం లోడుతో వెళుతోంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు లారీని బలంగా ఢీ కొట్టటంతో లారీ కిందకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న శ్వేతకు తీవ్రగాయాలు కాగా.. మిగిలినవారంతా ఘటనా స్థలంలోనే మరణించారు. వీరి వాహనం వెనుక ఉన్న కార్ల వారు ఆగి.. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మ్రతదేహాల్ని కారులో నుంచి బయటకు తీయటానికి గంటల కొద్దీ సమయం తీసుకుంది.
భారీ క్రేన్ సాయంతో కారును వెనక్కి లాగి.. అందులో నిర్జీవంగా పడి ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మ్రతదేహాల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శవ పంచనామాకు సమయం మించిపోవటంతో మార్చురీలో మ్రతదేహాల్ని ఉంచారు. కారు నడిపిన శివకుమార్ నిద్ర మత్తులో ఉండటంతో ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి నుంచి తిరిగి వచ్చే వేళలో.. మధ్యాహ్నం కావటం.. భోజనం చేసిన తర్వాత చేసే ప్రయాణంలో డ్రైవర్లు సాధారణంగా ఒకింత మత్తుగా ఉంటారు. దీనికి తోడు ఎండ తీవ్రత తొందరగా అలిసిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఇలాంటి వేళ.. ఔటర్ మీద అవసరానికి మించిన వేగంతో దూసుకెళ్లే కారు.. ఈ దారుణ ప్రమాదానికి కారణమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఔటర్ మీద లారీని ఆపి ఉంచటం నేరం. అయినప్పటికీ లారీ డ్రైవర్ శ్రీనివాస్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని నిలిపి ఉంచారని పోలీసులు వెల్లడించారు.
ఔటర్ స్పీడ్ లేన్ లో గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణించే వెసులుబాటు ఉంది. తాజా ప్రమాద తీవ్రతను చూస్తే.. వ్యాగనార్ కారు అంతకు మించిన వేగంతో వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి వ్యాగనార్ కారు గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణించే వేళ.. దాని ప్రమాద తీవ్రత చాలా చాలా ఎక్కువన్న మాట వాహన రంగ నిపుణుల నోట వినిపిస్తోంది. తాజా ఘోర ప్రమాదాన్ని చూస్తే.. డ్రైవర్ కనీసం బ్రేక్ వేసినట్లుగా కూడా కనిపించలేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆరుగురు ప్రాణాలు పోయేందుకు కారణమైన ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీతో పాటు.. అమితమైన వేగంతో దూసుకెళ్లిన కారు మీదా పెండింగ్ చలానాలు ఉండటం గమనార్హం.
సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీరామ బీడీ కంపెనీ యజమానికి (బొల్లి రాజు, భాగ్యలక్ష్మి) చెందిన సంతానమే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నిజానికి కారు సరిపోని కారణంగా బొల్లి రాజు.. భాగ్యలక్ష్మి దంపతులు ఇంట్లోనే ఉండిపోయారు. కూతురు కుటుంబంతో సహా కొడుకు ఇంటికి వేసవి సెలవులకు వచ్చిన వారు తాజా ప్రమాదంతో ఘోర విషాదం నెలకొంది. ఈ ఘటనపై సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ సోదరులే బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
