ప్రచారంలో పంచిన బహుమతుల్ని వద్దంటూ బయటపెట్టేశారు
ఎన్నికల ముఖ చిత్రం మారుతోంది. గతానికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Garuda Media | 16 Feb 2026 11:32 AM ISTఎన్నికల ముఖ చిత్రం మారుతోంది. గతానికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నికల సందర్భంగా పలు బహుమతులు..డబ్బులు ఓటర్లకు ఇచ్చేవారు. గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ వ్యవహారం ఇటీవల కాలంలో కాస్తంత ఓపెన్ గానే సాగుతోంది. అదే సమయంలో ఓటర్లకు తాము ఇవ్వాల్సిన తాయిలాల్ని ఇచ్చేసి.. ఓటు వేయాలన్న ప్రమాణాన్ని తీసుకొని వెళుతున్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారం మరో రేంజ్ కు చేరింది. ఎన్నికల్లో ఓడినోళ్లు.. తాము బహుమతులు ఇచ్చిన ఓటర్ల వద్దకు వెళ్లి.. ఓటు వేశావా? లేదా? అని అడగటం.. ప్రమాణం చేయాలని కోరటం.. లేదంటే తాము ఇచ్చిన బహుమతుల్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయటం ఈ మధ్యన మొదలైన మార్పు. తాజాగా ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే.. ఈసారి ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది.
యాదాద్రి భువనగిరి పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒకటో వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన బహుమతుల్ని.. ఓటర్లు వీధుల్లో పెట్టేసి.. తమకు అక్కర్లేదని.. తిరిగి తీసుకెళ్లిపోవాలని తేల్చి చెప్పేయటం హాట్ టాపిక్ గా మారింది.అంతేకాదు.. ఎన్నికల్లో ఓడిన ఆమె.. తాను పంచిన చీరలు.. హాట్ బాక్సులు.. కుక్కర్లను వీధుల్లో పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుచరులు.. బంధువుల నుంచి తమను కాపాడాల్సిందిగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఓటమి తర్వాత తమ వీధుల్లోకి వచ్చిన స్వరూపరాణి అనుచరులు ఇళ్ల మీదకు గాజు సీసాలు విసిరి బూతులు తిట్టినట్లుగా బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. ఓటర్ల మీద దాడులు జరుగుతున్న దానితో తనకు సంబంధం లేదని.. ఎన్నికల వేళ తాను చీరలు.. కుక్కర్లు పంచలేదంటూ ఆమె చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు ఆసక్తికకరంగా మారాయి.
