Begin typing your search above and press return to search.

శ్రీలక్ష్మి, ఐఏఎస్ : వివాదాస్పద నిర్ణయాలు.. న్యాయ పోరాటాలు.. నిశ్శబ్ద ముగింపు!

సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి మంగళవారం రిటైర్ కానున్నారు. ఈ నెల 25న ఆమెకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Political Desk   |   29 Jun 2026 5:00 PM IST
శ్రీలక్ష్మి, ఐఏఎస్ : వివాదాస్పద నిర్ణయాలు.. న్యాయ పోరాటాలు.. నిశ్శబ్ద ముగింపు!
X

సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి మంగళవారం రిటైర్ కానున్నారు. ఈ నెల 25న ఆమెకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రిటైర్మెంటుకు ఐదు రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చినా, వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో శ్రీలక్ష్మి కేవలం రెండు రోజులు మాత్రమే విధులకు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో ఒక రోజు బాధ్యతలు తీసుకోవడానికి సరిపోగా, రెండో రోజు రిటైర్మెంటు ఉత్తర్వులు తీసుకున్నారు. ఈ విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టులో రిటైర్ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో ఉన్న సంబంధాలు కారణంగా ప్రభుత్వం శ్రీలక్ష్మిని రెండేళ్లుగా వెయిటింగులో పెట్టిందని అంటున్నారు. ఇక రిటైర్మెంటును దృష్టిలో పెట్టుకుని న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా శ్రీలక్ష్మికి పోస్టింగు ఇచ్చిందని అంటున్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి ఉద్యోగ జీవితానికి కూటమి ప్రభుత్వం విలక్షణమైన ముగింపు చెప్పిందని అంటున్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాలో రిటైర్ కావాల్సిన శ్రీలక్ష్మి ఎటువంటి గుర్తింపు లేని పోస్టులో రిటైర్ కానుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 22 ఏళ్లకే సర్వీసులోకి వచ్చిన శ్రీలక్ష్మి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కేడర్ కు వెళ్లిపోయారు. అయితే గత ప్రభుత్వంలో తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారిన శ్రీలక్ష్మి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరిగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుకు నోచుకోక రెండేళ్లుగా వెయిటింగులో ఉన్నారు. అంతా సక్రమంగా ఉంటే ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా కేంద్ర కేబినెట్ కార్యదర్శి ర్యాంకులో రిటైర్ కావాల్సివుందని అంటున్నారు. కానీ, ఆమెపై ఉన్న కేసుల కారణంగా ఆలిండియా సర్వీసుల్లోని అత్యున్నత పోస్టులకు అర్హత కోల్పోయారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక 1988లో సర్వీసులోకి వచ్చిన శ్రీలక్ష్మి దాదాపు 38 ఏళ్లపాటు ఐఏఎస్ అధికారిణిగా వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఓబుళాపురం మైనింగ్ స్కాంలో ఇరుక్కుని కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెబుతున్నారు. ఓబుళాపురం మైనింగ్ స్కాం నిందితుల జాబితాలో శ్రీలక్ష్మిని సీబీఐ చేర్చడంతో 2011లో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఈ కేసు విషయమై న్యాయపోరాటం చేస్తూ పలుమార్పు జైలుకు వెళ్లడం, బెయిలుపై రావడం ద్వారా ఆమె కెరీర్ తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారం వల్లే పెద్ద పోస్టింగులకు నోచుకోలేకపోయారని అంటున్నారు. చివరికి రిటైర్మెంట్ సమయంలోనూ ఓబుళాపురం మైనింగ్ స్కాం భూతంలా వెంటాడంతో సాధారణ పరిపాలన శాఖలో జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీలక్ష్మి.. ఉమ్మడి రాష్ట్రంలో ఓబుళాపురం మైనింగ్ ద్వారా అత్యంత వివాదాస్పద అధికారిణిగా ముద్రపడ్డారని అంటున్నారు. అంతేకాకుండా ఆ కేసు ద్వారా ప్రస్తుత విపక్ష నేతలతో ఆమెకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వానికి టార్గెట్ గా మారారని చెబుతున్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఆమెను పక్కన పెట్టారని, చివరికి ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టుతో పదవీ విరమణకు అవకాశం కల్పించారని చెబుతున్నారు. దీంతో అఖిల భారత సర్వీసు అధికారుల్లో శ్రీలక్ష్మి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో వివాదాలు, మరెన్నో రాజకీయాల మధ్య సాగిన శ్రీలక్ష్మి ఉద్యోగ ప్రస్థానం ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారులు ఒక పాఠంగా నేర్చుకోవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.