హార్వర్డ్స్ లో చైనా ప్రెసిడెంట్ కుమార్తె... తెరపైకి సంచలన విషయాలు!
ఈ సడన్ నిర్ణయంపై అమెరికాలోని చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 30 May 2025 9:00 PM ISTఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ అక్కడున్న విదేశీ విద్యార్థులు.. ప్రధానంగా చైనా విద్యార్థులు, యూదు వ్యతిరేక ఆలోచనలు కలిగిన విద్యార్థులు లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. 'హార్వర్డ్ లో రహస్యంగా చిన్ పింగ్ కుమార్తె' అనే అంశం తెరపైకి వచ్చింది.
అవును... హార్వర్డ్ లో చైనా విద్యార్థుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తుందని.. యూదు వ్యతిరేక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. అమెరికాలోని చైనీయుల వీసాలను రద్దు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.
ఈ సడన్ నిర్ణయంపై అమెరికాలోని చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కుమార్తె జి మింగ్జి.. హర్వర్డ్స్ లో చదివారని, ఆమె మసాచుసెట్స్ లో నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు!
ఇదే సమయంలో.. మింగ్జి ను కెమెరా ముందుకు తీసుకొచ్చి ఆమె తండ్రి జిన్ పింగ్ విధానాల గురించి ప్రశ్నిస్తానని పేర్కొన్న లూమర్... కమ్యునిస్టులు అసలు తమ దేశానికే చెందినవారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె తాజా వ్యాఖ్యలతో జిన్ పింగ్ కుమార్తె అంశం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన పలు కీలక విషయాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి!
ఇందులో భాగంగా... జిన్ పింగ్ కుమార్తె అత్యంత రహస్య జీవితం కొనసాగిస్తున్నారని.. ఆమె తొలుత చైనాలోని బెజియాంగ్ యూనివర్సిటీలో చదువుకున్నారని.. అనంతరం వేరే పేరుతో హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని అంటున్నారు. ఆ తర్వాత ఆమె చైనాకు తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు.
అయితే.. ఆమె తన చదువును కొనసాగించేందుకు తిరిగి హార్వర్డ్ కు వచ్చి ఉండొచ్చని పలు నివేదికలు వెల్లడవుతున్న వేళ.. ఆమె ప్రభుత్వ భద్రతతో మసాచుసెట్ లో ఉంటున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి. దీంతో.. ఆమె గురించిన చర్చ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
