Begin typing your search above and press return to search.

చైనా అధ్యక్షుడ్ని మార్చడం సాధ్యమేనా?

చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. కానీ ఓ నియంతృత్వ పాలన కూడా కాదు. అక్కడ "ఏకపక్ష పాలన" ఉంది.

By:  Tupaki Desk   |   3 July 2025 7:00 PM IST
చైనా అధ్యక్షుడ్ని మార్చడం సాధ్యమేనా?
X

ప్రపంచ రాజకీయాల్లో చైనా ఒక కీలక పాత్ర పోషిస్తున్న దేశం. ఆ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి జీ జిన్ పింగ్‌ అయితే, ఇప్పుడు ఆయన కనిపించడం లేదు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జిన్ పింగ్‌ ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరుకాలేదు. ముఖ్యంగా బ్రిక్స్‌ సమావేశానికి ఆయన ప్రత్యక్షంగా హాజరుకాకపోవడం గమనార్హం. దీంతో ఆయన ఆరోగ్యం, గుట్టుచప్పుడు కాకుండా నాయకత్వ మార్పు జరుగుతోందా అన్న చర్చలకు బలమవుతోంది.

చైనాలో పాలన ఎలా ఉంటుంది?

చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. కానీ ఓ నియంతృత్వ పాలన కూడా కాదు. అక్కడ "ఏకపక్ష పాలన" ఉంది. కమ్యూనిస్టు పార్టీ ఆదేశమే చైనాలో శాసనం. పార్టీకి చెందిన పాలక వర్గమే అన్ని అధికారాలను నిర్వర్తిస్తుంది. మిలటరీ కూడా ప్రభుత్వానికి కాదని, కమ్యూనిస్టు పార్టీకి కట్టుబడి ఉంటుంది. దీన్ని "పార్టీ మిలటరీ" అంటారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత అయిన జీ జిన్ పింగ్‌కు అపారమైన అధికారాలు ఉన్నాయి.

- జీవితాంతం అధ్యక్షుడిగా?

2018లో చైనా రాజ్యాంగంలో చేసిన మార్పుతో అధ్యక్ష పదవికి గడువు పరిమితి తొలగించబడింది. దీంతో జిన్ పింగ్ జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగే వీలుకలిగింది. ఈ నిర్ణయం ద్వారా ఆయన అధికారాన్ని మరింత బలపరిచారు. పార్టీపై పూర్తి పట్టు సాధించిన జిన్ పింగ్‌కు వ్యతిరేకులు పార్టీ లోపల కనబడడమే లేదు. ఆయన నిర్ణయమే తుదినిర్ణయం.

- పదవి కోల్పోవడం అంత తేలిక కాదు

చైనా వంటి ఒక గట్టి రాజకీయ వ్యవస్థలో, అది కూడా జీ జిన్ పింగ్ వంటి నాయకుడి హయాంలో అధ్యక్షుడిని మారుస్తామంటే అది సాధారణ విషయం కాదు. పార్టీ చీఫ్, సైనికాధ్యక్షుడు, రాష్ట్రపతి.. ఈ మూడు హోదాలు కలిసే ఒకే వ్యక్తిలో ఉంటాయి. అతన్ని పదవి నుంచి తొలగించాలంటే, పార్టీ అగ్రనాయకత్వమే తిరుగుబాటు చేయాలి. అలాంటి పరిస్థితులు ఇప్పటికైతే కనిపించట్లేదు.

జిన్ పింగ్‌ అసలు ఎక్కడ?

ఇంతకీ జిన్ పింగ్ ఎక్కడ? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇంకా బయటకు రాలేదు. గతంలోనూ ఆయన కొన్ని వారాల పాటు కనిపించకుండా ఉండిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తిరిగి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కూడా ఆయన మళ్లీ బయటపడతారని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మీడియాలో "వాంగ్ యంగ్" అనే నాయకుడిని జిన్ పింగ్ స్థానంలో పెట్టే ఆలోచన జరుగుతోందని కథనాలు వస్తుండటం మాత్రం ఆసక్తికరం.

చైనా అధ్యక్షుడిని మార్చడం, అది కూడా జిన్ పింగ్ లాంటి పవర్ ఫుల్ నాయకుడిని తొలగించడం అంత సులువు కాదు. కానీ రాజకీయాలలో ఊహించని మలుపులు సాధారణమే. జిన్ పింగ్ కనిపించకపోవడమే కొన్ని వార్తలకు బీజం కావొచ్చు. కానీ నిజమైన మార్పు జరిగితే, అది చైనా రాజకీయాల్లో పెద్ద తలకిందులే కావచ్చు.