Begin typing your search above and press return to search.

చంద్రబాబు అరెస్టుపై జెనెక్స్ స్టోర్ట సంచలన నిర్ణయం!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనల్నినిర్వహిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Sep 2023 5:06 AM GMT
చంద్రబాబు అరెస్టుపై జెనెక్స్ స్టోర్ట సంచలన నిర్ణయం!
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనల్నినిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మిగిలిన వారికి భిన్నంగా హైదరాబాద్ కు సంబంధించిన ఒక వ్యాపార సంస్థ చేపట్టిన నిరసన సంచలనంగా మారింది. వ్యాపారాన్ని రాజకీయాలతో ముడి పెట్టని సూత్రానికి విరుద్ధంగా.. సదరు సంస్థ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన జెనెక్స్ సంస్థ వైసీపీ అండ్ కోకు ఎలాంటి వ్యాపార సేవల్ని అందించకూడదన్న నిర్ణయాన్ని ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు అక్రమ అరెస్టుపై గ్రేటర్ హైదరాబాద్ లోని ఆటోమొబైల్ రంగంలో కార్ కేర్ సేవల్ని అందించే జెనెక్స్ సంస్థ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. తమ సంస్థ ఇక నుంచి వైసీపీకి చెందిన ఎవరికి ఎలాంటి వ్యాపార సేవల్ని అందించదని స్పష్టం చేశారు. తమ సంస్థకు మాదాపూర్ తో పాటు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో స్టోర్లు ఉన్నట్లుగా చెప్పారు.

సంస్థకు చెందిన ఎండీ అమర్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు మద్దతు ఇవ్వటం తన బాధ్యతగా పేర్కొన్నారు. అందుకే తాము వైసీపీకి చెందిన వారికి సర్వీసులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. 2005లో హైదరాబాద్ లో తమ సంస్థను ప్రారంభించామని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. హైటెక్ సిటీ..గచ్చి బౌలి ప్రాంతం డెవలప్ అయ్యిందని.. దాంతోనే తమ సంస్త కూడా డెవలప్ అయినట్లుగా పేర్కొన్నారు. అందుకే.. తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. గడిచిన ఇరవై ఏళ్లలో తన మాదిరి కొన్ని లక్షల మంది హైదరాబాద్ లో ఆనందంగా ఉన్నారంటే.. అందుకు చంద్రబాబు వేసిన పునాదేనని పేర్కొన్నారు.

చంద్రబాబు పునాదిని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. కేటీఆర్ లు కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బాబు జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా తమ సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. శనివారం సాయంత్రం నుంచి జెనెక్స్ సంస్థపై గూగుల్ లో తీవ్రమైన ప్రతికూల రివ్యూలు వరద మాదిరి పోస్టు కావటం ఆసక్తికరంగా మారింది. సర్వీసు చెత్తగా ఉందంటూ నెగిటివ్ రేటింగ్ ఇవ్వటం గమనార్హం.