బట్టలు ఊడదీసిన ఫేక్ బికినీ ఫోటో వివాదం: గ్రోక్ AIపై బ్రిటన్ ఎంపీ కేసు
ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'xAI' మరోసారి చిక్కుల్లో పడింది.
By: Madhu Reddy | 5 Jun 2026 1:35 PM ISTఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'xAI' మరోసారి చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ తీసుకొచ్చిన 'గ్రోక్' చాట్‌బాట్ సృష్టిస్తున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. మొన్న అమెరికాలో ఒకరైతే, నిన్న బ్రిటన్‌లో మరొకరు దీనిపై కోర్టుకెక్కారు. ఒక మహిళా ఎంపీ అనుమతి లేకుండా ఆమె ఫేక్ బికీనీ ఫోటోలను క్రియేట్ చేయడంతో ఈ రచ్చ మొదలైంది. అసలు ఏం జరిగిందంటే..
బ్రిటన్ ఎంపీ వర్సెస్ ఎలాన్ మస్క్ కంపెనీ:
బ్రిటన్ అధికార లేబర్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు జెస్ అసాటో లండన్ హైకోర్టులో xAI కంపెనీపై కేసు వేశారు. గ్రోక్ చాట్‌బాట్‌ను ఉపయోగించి ఎవరో తన ఫోటోలను అసభ్యకరంగా మార్చేశారని ఆమె ఆరోపించారు. తన అనుమతి లేకుండా ఫేక్ బికీనీ ఫోటోలు తయారు చేయడం ప్రైవసీ ఉల్లంఘన అని ఆమె కోర్టును ఆశ్రయించింది. బ్రిటన్ డేటా రక్షణ చట్టాల ప్రకారం ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆన్‌లైన్ వేధింపులపై గళం విప్పినందుకేనా?:
అసలు జెస్ అసాటోకు ఈ తిప్పలు ఎందుకు వచ్చాయంటే, ఆమె ఆన్‌లైన్‌లో జరిగే డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ సమస్యపై గతంలో గట్టిగా మాట్లాడారు. అలా మాట్లాడిన కొన్ని రోజులకే, ఈ ఏడాది జనవరిలో ఎవరో కావాలనే గ్రోక్ బాట్ సాయంతో ఆమె అసలు ఫోటోలను డిజిటల్‌గా మార్చేసి, బికీనీ ఫోటోలుగా క్రియేట్ చేశారు. "నడిరోడ్డుపై ఎవరైనా వచ్చి నా బట్టలు ఊడదీయగలరా? మరి ఆన్‌లైన్‌లో మాత్రం నా ఫోటోలను అలా మార్చే హక్కు ఎవరిచ్చారు?" అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
గ్రోక్ బాట్‌కు ఇవేమీ కొత్త కాదు:
గ్రోక్ చాట్‌బాట్ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో అమెరికాకు చెందిన రచయిత్రి యాష్లే సెయింట్ క్లైర్ కూడా న్యూయార్క్ కోర్టులో గ్రోక్‌పై దావా వేశారు. తనను మైనర్ బాలికలా చూపిస్తూ, చాలా అశ్లీల చిత్రాలను గ్రోక్ జనరేట్ చేసిందని ఆమె కోర్టుకు వెళ్లారు. ఈ వరుస కేసులతో గ్రోక్ టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థమవుతోంది.
రూల్స్ మార్చినా తప్పని తిప్పలు:
ఈ ఏడాది మొదట్లోనే ఇలాంటి విమర్శలు రావడంతో xAI కంపెనీ అలర్ట్ అయింది. నిజమైన వ్యక్తుల ఫోటోలను అప్‌లోడ్ చేసి, వారి బట్టలు తొలగించేలా లేదా మార్చేలా ఎడిట్ చేయడాన్ని గ్రోక్‌లో నిషేధిస్తూ రూల్స్ మార్చింది. కానీ, జెస్ అసాటో మాత్రం ఈ మార్పులను ఒప్పుకోవడం లేదు. ఇల్లు పూర్తిగా కాలిపోయాక ఫైర్ ఇంజన్ వచ్చినా ఉపయోగం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక పాలసీలు మార్చితే పోయిన గౌరవం తిరిగి వస్తుందా?" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసుకు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ కూడా మద్దతు ప్రకటించారు. ఆ ఫోటోలు చాలా అసహ్యకరంగా ఉన్నాయని, అసాటో కోర్టుకు వెళ్లడం సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. అయితే, ఈ కేసుపై ఎలాన్ మస్క్ కంపెనీ xAI ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి డీప్ ఫేక్ ముప్పులు ఎంత భయంకరంగా మారుతున్నాయో చెప్పడానికి ఈ వివాదమే ఒక పెద్ద ఉదాహరణ. కోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో AI కంపెనీలకు ఒక గుణపాఠంలా మారుతుందో లేదో చూడాలి.
